BRS-CONGRESS: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల చేరిక ఆగినట్టేనా? చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదా? ఇప్పుడు చేరిన పది మందిలో చాలామంది పునరాలోచనలో ఉన్నారా? అనవసరంగా పార్టీని వీడి తప్పుచేశామని భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను చావుదెబ్బ తీయ్యాలని కాంగ్రెస్ భావించింది. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను చేర్చుకొని ప్రతిపక్ష హోదాలేకుండా చేయాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా పావులు కదపడం ప్రారంభించింది. కానీ బీఆర్ఎస్ వ్యూహానికి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలక తప్పలేదు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుండి 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. మొత్తానికి విజయవంతంగా 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. మిగిలిన 16 మందిని చేర్చుకునే విషయంలో అడుగులు ముందుకు పడడం లేదు.ఈ నేపథ్యంలో పార్టి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసి, హైకోర్టును ఆశ్రయించింది. ముందుగా ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత అంశాన్ని నాలుగు వారాలలో తేల్చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ మొండిగా ముందుకు సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వారిపై అనర్హత వేటు వేయాలని భావిస్తోంది. ఆ ముగ్గురిపైనే కాదు..మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. 26 మంది చేరే అవకాశం లేదని తేలిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హత వేటు నుండి కాపాడుకునేందుకు కొత్త ప్లాన్ తెరమీదకు తెచ్చింది. శాసనసభలో ఉన్న నిబంధన ప్రకారం ఏదైనా పార్టీ నుండి నాలుగో వంతు మంది సభ్యులు బయటకు వచ్చి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం ఉంటుందని, ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. దానం నాగేందర్ ఏకంగా ఎంపీగా పోటీ చేయగా, పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ సలహాదారు పదవి దక్కింది. ఈ ఆధారాలు అన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కీలకం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్లాన్ బి ఎంత వరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.అ యితే కాంగ్రెస్ పార్టీ న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. ఆ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని చూస్తోంది. అయితే దానం నాగేందర్ విషయంలో మాత్రం అనర్హత వేటు తప్పదని తెలుస్తోంది.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరరని తెలుస్తోంది. కాంగ్రెస్ లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎవరు ఎప్పుడు అలకపాన్పు ఎక్కుతారో తెలియని పరిస్థితి. మరోవైపు పీసీసీ నాయకత్వం విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది. దక్కని వారు తీవ్ర నిరాశతో ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం క్యూకడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ కూడా కత్తిమీద సామే. ఆశావహులకు పదవి దక్కకపోతే వారు తప్పకుండా ప్రభావం చూపుతారు. దీంతో కాంగ్రెస్ లో విభేదాలు ముదరికిపాకాన పడే అవకాశముంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారే నిర్ణయానికి ఫుల్ స్టాప్ పెట్టక అనివార్య పరిస్థితి ఎదురైంది.