Tuesday, October 8, 2024

BRS : ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ ఎదుర్కొగలదా?

- Advertisement -

BRS : కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఆదేశాలు ప్ర‌తిప‌క్ష బీఆర్ ఎస్ పార్టీలో సంబ‌రాలు నింపాయి. ముఖ్యంగా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరికలు నిలిచిపోతాయని భావిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించినట్టు అయ్యిందని అనుకుంటున్నారు.అదిగో మేం చెబితే విన‌లేదు.. ఇప్పుడైనా వేటు వేయండి..అని బీఆర్ ఎస్ నాయకులు ప్ర‌శ్నిస్తున్నారు. హైకోర్టు ఉత్త‌ర్వుల మేర‌కు స్పీక‌ర్ ప్ర‌సాద‌రావు నిర్ణ‌యం తీసుకోక త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది. దానం నాగేంద‌ర్‌, తెల్లం బాల‌రాజు, క‌డియం శ్రీహ‌రిలు పార్టీ మారార‌ని.. వీరిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని ఎప్ప‌టి నుంచో బీఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే పార్టీల్లో చేరికలు ఇప్పుడే కాదు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్ఎస్ లో చేరి మంత్రులు అయిన వారు ఉన్నారు. కానీ ఈసారి పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వెళ్లిపోవడంతో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. అందుకే కోర్టును ఆశ్రయించింది.

అయితే కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు బీఆర్ ఎస్‌, బీజేపీ నాయ‌కులు వేర్వేరుగా కోర్టుకు వెళ్లారు. చివ‌ర‌కు సోమ‌వారం ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో స్పీక‌ర్ ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించింది. లేక‌పోతే.. తామే సుమోటోగా ఈ విష‌యంపై కేసు చేప‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని కూడా చెప్పారు.అయితే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్న. న్యాయనిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. ఒక వేళ స్పీకర్ తో సంజాయిషి ఇప్పించడమా? లేకుంటే వారితో రాజీనామా చేయించడం ఉత్తమమా? అని అలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే బీఆర్ఎస్ సంబరపడిపోతోంది కానీ..అసలు ఆ పార్టీ ఉప ఎన్నికలను ఎదుర్కొనగలదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే వరుస ఓటములు, పార్టీ నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు వెళ్లిపోవడంతో డీలా పడింది. మరోవైపు కవిత రూపంలో కేసులు ఎదురయ్యాయి. కేసీఆర్ సైతం బయటకు రావడం లేదు. లోలోపల వ్యూహాలకు పరిమితమవుతున్నారు. అయితే ఉప ఎన్నిక‌లు ఖాయ‌మ‌ని.. బీఆర్ ఎస్ నాయ‌కులు రెడీగా ఉండాల‌ని కూడా.. మాజీమంత్రి హ‌రీష్‌రావు ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతా బాగానే ఉంది. రేపు ఉప ఎన్నిక‌లే వ‌చ్చినా.. బీఆర్ ఎస్ త‌ట్టుకుని గ‌ట్టెక్కుతుందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఎన్నిక‌లు జ‌రిగి 10 మాసాలైంది. ఈ ప‌ది నెల‌ల‌లో బీఆర్ ఎస్ ఎక్క‌డా పుంజుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. పైగా పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జీరో పెర‌ఫార్మెన్స్ చూపించింది. కాబ‌ట్టి ఇప్పుడు ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా.. స‌త్తా చాటే అవ‌కాశం ఎంత‌? అనేది ప్ర‌శ్న‌.

బీఆర్ఎస్ తో పోలిస్తే అధికార కాంగ్రెస్ దూకుడు మీద ఉంది. బీజేపీ సైతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఎంత వరకు తట్టుకొని నిలబడగలదే అన్నది ప్రశ్న. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఏమాత్రం స‌త్తా చూపించ‌లేక పోయిన విష‌యం తెలిసిందే. ఇక‌, పార్టీ అదినేత కేసీఆర్ కూడా ప్ర‌జ‌ల మ‌ద్య‌కు రావ‌డం లేదు. మ‌రోవైపు మాస్ నాయ‌కుడిగా సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. రైతు రుణ మాఫీ.. వ‌ర‌ద బాధితుల‌కు సాయం వంటి వాటిలో దూకుడుగా ఉన్నారు. ఇక‌, హైడ్రాతో చెల‌రేగిపోతున్న విష‌యం కూడా తెలిసిందే. దీనికితోడు పార్టీలోను.. ప్ర‌భుత్వంలోనూ రేవంత్‌కు తిరుగులేకుండా పోయింది. మ‌రి ఇన్ని పాజిటివ్‌లు ఇటువైపు క‌నిపిస్తుంటే.. బీఆర్ ఎస్ ఏమేర‌కు పుంజుకుంటుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!