Tuesday, October 8, 2024

AP POLITICS: ఇంతకంటే దారుణం ఉంటుందా..? ప్రజలు విపత్తులో ఉంటే కూడా ఇంత నీచమా..??

- Advertisement -

AP POLITICS: రాజకీయ పార్టీ అధినాయ‌కుల‌ను ప్రశంసించవచ్చు. పొగడ్తల వ‌ర్షం కూడా కురిపించ‌వ‌చ్చు. కానీ అది రాష్ట్రంలో కీల‌క‌మైన స‌మ‌స్య‌లు లేన‌ప్పుడు చేయాల్సిన ప‌ని. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. వరద ప్ర‌భావిత విజ‌య‌వాడ ఇంకా కోలుకోలేదు. ప్ర‌ధాన ర‌హ‌దారులు మాత్ర‌మే బాగున్నాయి త‌ప్ప‌ ప్ర‌జ‌లు నివ‌సించే ప్రాంతాల్లో ఇంకా మోకాల్లోతు వరకు మురికి నీరు అలాగే ఉంది. వారికి ప్రభుత్వం ఎంత‌ వ‌ర‌కు సాయం చేస్తుందో ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ప్ర‌ధాన‌ అధికార పార్టీ టీడీపీ సాయంపై ప్ర‌క‌ట‌నలుచేస్తున్నా చేతిలో చిల్లిగ‌వ్వ‌లేద‌ని మంత్రులు చెబుతున్నారు.

మ‌రోవైపు ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ కార‌ణంగా పిఠాపురం స‌హా కాకినాడ‌లోని 65 గ్రామాలూ జ‌ల‌దిగ్బంధంలోనే ఉన్నా యి. ఇలాంటి స‌మ‌యంలో అంద‌రి చూపూ రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌పైనే ఉంది. తాజాగా బీజేపీ నాయ‌కురాలు పురంధేశ్వ‌రి అధ్య‌క్ష‌తన విజ‌య‌వాడ‌లో మీటింగ్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వారంతా ఏపీ ప‌రిస్థితుల‌పై చ‌ర్చిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. మ‌రీ ముఖ్యంగా అందరూ కలిసి కేంద్రానికి నివేదిక ఇస్తార‌ని రాష్ట్రానికి సాయం త్వ‌ర‌గా చేసేలా చూస్తార‌ని భావించారు. కానీ ఈ స‌మావేశం మొత్తం మోడీ భ‌జ‌న‌తోనే సాగిపోయింది.

దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడమే బీజేపీ విధానం. ప్రధాని మోడీ సారధ్యంలో దేశ ప్రజల సంతోషంగా ఉన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ బోర్డు కు మార్పులు చేర్పులు వంటి అంశాలను ధైర్యంగా మోడీ అమలు చేశారు. ఎన్డీఎ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీకి అన్యాయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఎప్పుడూ లేదు. అమరావతి రాజధాని అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉంది. 2500 కోట్ల నిధులు నేరుగా గతంలో కేంద్రం రాస్త్రానికి మంజూరు చేసింది. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు డిపిఆర్ ఓకే చేశారు. అంత‌ర్గ‌త‌ రోడ్ల విస్తరణకు గడ్కరీ ఆమోదం తెలిపారు అంటూ ఈ సందర్భంగా పురంధేశ్వ‌రి వ్యాఖ్యానించారు.

ఎక్క‌డా కూడా విజ‌య‌వాడ, కాకినాడ‌, గుంటూరు, బాప‌ట్ల వ‌ర‌ద బాధితుల గురించిన ప్ర‌స్తావ‌నే లేకుండాపోయింది. వారికి చేసే సాయంపై కూడా ఎవ‌రూ నోరు విప్ప‌లేదు. బాధితుల‌కు బీజేపీ ప‌క్షాన ఏమైనా సాయం చేసి ఉంటే దానిని కూడా చెప్ప‌లేదు. క‌నీసం ప్ర‌భుత్వం చేప‌డుతున్న సాయానికి తమ వంతు సాయం చేస్తామ‌ని కూడా క‌మ‌ల నాథులు ప్ర‌క‌టించ‌లేక పోయారు. ఈ విష‌యాలే ఇప్పుడు విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయి. రాష్ట్రం ఒక ప‌క్క ఇబ్బందుల్లో ఉన్నా ఈ భ‌జ‌న‌లేంట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుల వైఖరిని ప్రతిపక్షాలు సైతం తప్పు పడుతున్నాయి. ప్రజలు విపత్తులో ఉంటే కూడా ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తారని వారు బీజేపీ నాయకులని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!