Congress: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కంటే..తెచ్చిన గులాభీ పార్టీకే ముందుగా ప్రజలు పట్టం కట్టారు.తొమ్మిదేళ్ల నిరీక్షణ అనంతరం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను గుర్తించారు. గత ఏడాది డిసెంబరులో అధికారం ఇచ్చారు. లేటుగా అయినా తెలంగాణ ప్రజలు గుర్తించడంతో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. తమకు అధికారం లభించిన డిసెంబర్ ను చాలా ప్రత్యేక నెలగా భావిస్తుంది.గతంలో డిసెంబర్ నెలలోనే తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం సానుకూలం నిర్ణయం తీసుకుంది.దాంతో పాటు గత డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో డిసెంబర్ నెలను కాంగ్రెస్ చాలా సెంటిమెంట్ గా తీసుకుంది. అన్నింటికీ మించి డిసెంబర్ లో మరో ప్రత్యేక ఉంది అని కాంగ్రెస్ చెబుతుంది. తమ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 న ఉండడంతో ఆ రోజున భారీ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటి నుంచే డిసెంబర్ లో ఏం చేయాలో అని రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో చర్చిస్తున్నారట.
డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించాలనుకుంటుందంట. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారిగా వస్తున్న బర్త్ డే కావడంతో అదిరిపోయేలా వేడుకలు చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది. అందుకు తగినట్టుగా ఇప్పటి నుంచే రేవంత్ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం. ఈ సారి సోనియా బర్త్ డే ను తెలంగాణ వ్యాప్తంగా అదిరిపోయేలా చేయాలని కాంగ్రెస్ భావిస్తుందంట. ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ యోచిస్తుందని గాంధీ భవన్ టాక్. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ చాలా వాగ్ధానాలు ఇచ్చింది. అందులో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తుండగా మరి కొన్ని కీలక అంశాలను డిసెంబర్ లో ప్రభుత్వం పరంగా ప్రకటించాలని రేవంత్ సర్కార్ భావిస్తుందంట.అందులో ముఖ్యమైనది జనగణను కు సంబంధించి ప్రభుత్వ పరంగా కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.
డిసెంబర్ నెలలో జరిగే శీతకాల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఈ కీలక ప్రకటన ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కులగణన చేపట్టాలని తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కాంగ్రెస్ కు ఇటు పార్టీ నుంచే ఇతర బీసీ సంఘాల నుంచి కూడా కులగణనపై పెద్ద ఎత్తున ఒత్తడి ఉంది. దీనికి చెక్ పెట్టేలా డిసెంబర్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎలాగో ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం కాబట్టి డిసెంబర్ నెలలో దీనిపై అధికారికంగా ప్రకటన చేస్తే తెలంగాణలోని మెజార్టీ బీసీ వర్గాలు కాంగ్రెస్ వైపు ఉంటాయనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది.
మరొక కీలక అంశం ఏంటంటే నిరుద్యోగ యువతకు సంబంధించి రేవంత్ సర్కార్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందంట. గ్రూప్స్, టీచర్ ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్ మెంట్ లకు సంబంధించి కీలక ప్రకటన చేయాలని కాంగ్రెస్ భావిస్తుందంట. . ఈ అన్నింటికి కలిపి సుమారు 25 వేల నుంచి 30వేల ఉద్యోగాల భర్తీకీ ప్రకటన చేయాలనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తుంది.దీనిపై ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాల ప్రకటనతో యువతలో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను తొలగించుకోవడంతో పాటు కాంగ్రెస్ పై నిరుద్యోగులకు నమ్మకం కలిగించినట్లు అవుతుందనేది కాంగ్రెస్ వర్గాల అంచనా.దీంతో పాటు డిసెంబర్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలని కాంగ్రెస్ భావిస్తుందంట. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీనీ ముఖ్య అతిధిగా పిలిపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. అంతే కాదు సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించాలని కాంగ్రెస్ భావిస్తుందంట. దీనికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనీ పిలవాలని అనుకుంటుందంట. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా చేతుల మీదుగా తెలంగాణ విగ్రహావిష్కరణ చేస్తే తెలంగాణ ప్రజల్లో మరింత సానుకూల వాతావరణం ఉంటుందనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచనట. అంతే కాదు అదే రోజు సోనియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకుంటుందట.
వీటితో పాటు జర్నలిస్టుల సమస్యలపై కూడా రేవంత్ సర్కార్ డిసెంబర్ లోనే సానుకూల ప్రకటన చేసే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లో పని చేసే జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలకు సంబంధించి తీపి కబురు చెప్పబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఇవే కాదు ఇతర వర్గాలకు సంబందించిన పలు అంశాలపై ప్రభుత్వపరంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తుందంట. ఈ అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యచరణను త్వరలోనే అధికారికంగా ప్రకటించవచ్చనేది కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ భారీ ప్లాన్ తో ఉందన్న మాట.