Tuesday, October 8, 2024

PM MODI: ఏపీలో మూడు నెలల పాలనపై మోదీ రహస్య రివ్యూ

- Advertisement -

PM MODI: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమిగా ఏర్పడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ, జనసేనలతో పొత్తుగా ఏర్పడి రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ తన ప్రయాణం కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు అధికారం చేపట్టి దాదాపు మూడు నెలలు దగ్గర పడుతున్నా రాష్ట్ర అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు వల్ల నిధులు బాగానే ముడుతున్నా రాష్ట్రంలో తలెత్తుతున్న పరిస్థితుల వల్ల ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉండడం, దానికి తోడు ఇటీవల ఏపీని ముంచెత్తిన వరదలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే పరిస్థితులు చక్కబెడుతుండడం, ఇప్పుడిప్పుడే కుదురుకుంటుంది అన్న క్రమంలో విజయవాడలో భారీ వరదలు, ఆ విపత్తు నుంచి ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపశమనం కలగని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఏపీలో టీడీపీ కూటమి మూడు నెలల పాలనపై రహస్య రివ్యూ చేయనున్నట్లు తెలుస్తుండడంతో.. కూటమి నేతలలో హై టెన్షన్ వాతావరణం కనబడుతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి నిర్మాణానికి రూ. 15వేల కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని కూడా హామీ లభించింది. ఆంధ్రప్రదేశ్ రైతులు, దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. కానీ, అభివృద్ధి మాట పక్కనపెడితే అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏ మాత్రం తేడా లేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మోదీ నిర్వహించ తలపెట్టిన రహస్య రివ్యూ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు, ఇటీవలి వరద విపత్తుపై ప్రధాని ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. మరి ఈ రహస్య భేటీలో రాష్ట్ర అభివృద్ధిపై, చేపట్టాల్సిన కార్యాచరణలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!