Tuesday, October 8, 2024

POLICE: ఏడాది కాక మునుపే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ వెనుక జరిగిందేంటి?

- Advertisement -

POLICE: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆకస్మిక బదిలీ వెనుక కారణమెంటి? తెర వెనుక ఏమైన రాజకీయం జరిగిందా? లేకుంటే కేసీఆర్ హయాంలో నాటి అధికారినే తిరిగి రప్పించడం వెనుక మర్మమెంటి? దీని వెనుక జరిగింది ఏమిటి? తెలంగాణ పొలిటికల్, పోలీస్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ పోస్టు అంటే హాట్ కేక్ లాంటిది. అక్కడ పనిచేసేందుకు ఐపీఎస్ లు ఎంతో తపిస్తారు. అంత పవర్ ఫుల్ ఆ పోస్టు. దక్కిందా గోల్డెన్ చాన్స్ గా భావిస్తారు. సర్వీసులో దానిని ఒక రికార్డుగా చెప్పుకుంటారు. సిన్సియార్టీ, సీనియార్డిని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఆపై ప్రభుత్వ పెద్దల సిఫార్సులకు పెద్దపీట వేసి నియమిస్తారు. అటువంటి చాన్స్ దక్కించుకున్నారు తాజాగా బదిలీ అయిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి. అయితే ఏడాది తిరగక మునుపే ఆయన బదిలీ కావడం చర్చకు దారితీసింది.

తెలంగాణలో గత ఏడాది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని ఏరికోరి ఎంపిక చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఎస్పీగా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డికి అప్పటి నుంచే రేవంత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక నిజాయితీ, సమర్థత.. ఆయనకు అదనపు బలాలు. డిపార్ట్‌మెంట్‌లో పనితీరు విషయంలో ఎలాంటి విమర్శలు లేని శ్రీనివాస్‌రెడ్డిని సీపీగా చేయాలనే ప్రతిపాదన రాగానే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. అయితే అనూహ్యంగా ఒక్క ఏడాది కూడా పనిచేయకుండానే ప్రభుత్వం కొత్తకోటను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తెరవెనుక ఏం జరిగిందనే చర్చ సాగుతోంది.

వాస్తవానికి గతంలో హైదరాబాద్ లో శ్రీనివాసరెడ్డి పనిచేయలేదు. పైగా ఎక్కువ కాలం లూప్ లైన్ లో పనిచేశారు. కనీసం డీజీ క్యాడర్ కూడా లేదు. కేవలం సీఎం రేవంత్‌రెడ్డితో అనుబంధం కారణంగా శ్రీనివాస్‌రెడ్డికి సీపీగా నియమించినట్లు చెబుతున్నారు. కానీ, ఏడాది తిరగకుమందే ఆయనను ఆకస్మాత్తుగా బదిలీ చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి 2006లో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా పని చేశారు.. ఆ తర్వాత చాలా కాలం లూప్ లైన్‌ పోస్టులకే పరిమితమయ్యారు. సుదీర్ఘ కాలం గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లలో పని చేశారు.. అయితే సీఎంతో ఉన్న సంబంధాల వల్ల రేవంత్‌ సర్కార్‌ కొలువు దీరగానే సీపీ బాధ్యతలు అప్పగించినా నిలుపుకోలేకపోవడం వెనుక ఆయన ముక్కుసూటి తనమే కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

శ్రీనివాస్‌రెడ్డికి సిటీ పోలీస్‌ వింగ్‌లో పనిచేసిన అనుభవం లేకపోయినా, ప్రభుత్వం నమ్మకం ఉంచింది. కానీ, కొన్ని విషయాల్లో ఆయనపై వస్తున్న విమర్శలతో ఇప్పుడు పక్కన పెట్టిందంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఆయన నిర్వహించిన సమావేశం ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అదే సమయంలో కిందిస్థాయి సిబ్బందితో సఖ్యత లేకపోవడంతో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి. సిబ్బందితో దురుసు ప్రవర్తన… చిన్న నిర్లక్ష్యానికి పెద్ద పనిష్ మెంట్లు.. సరైన విచారణ లేకండా మెమోలు, సస్పెన్షన్లు అంటూ సిబ్బందిని హడలెత్తించిన సీపీ శ్రీనివాస్‌రెడ్డిపై ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పెద్దలకు తలనొప్పులు తెచ్చేలా వ్యవహరించడం కూడా ఆయనను పక్కన పెట్టడానికి ప్రధాన కారణమైందంటున్నారు. మొత్తానికైతే ఏడాది తిరగక మునుపే హైదరాబాద్ పోలీస్ కమిసనర్ బదిలీ అనేక చర్చలకు కారనమవుతోంది,

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!