జగన్ పార్టీని సాఫీగా నడపగలరా? అసలు వైసీపీ ఉనికి చాటుకుంటుందా? లేకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగా ప్రమాదంలో పడుతుందా? 2029 ఎన్నికల నాటికి పార్టీ మిగులుతుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పార్టీని కాపాడుకోవడం, క్యాడర్ కు ఆత్మస్థైర్యం ఇవ్వడం, కేసులను ఎదుర్కోవడం ఇలా చాలా రకాల సమస్యలు జగన్ ముందు ఉన్నాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన సమయం ఇది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ముందుగా ఇప్పుడు ఓటమి నుంచి బయటపడాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అయితే ఓటమిని అంగీకరిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పోరాటానికి సై అన్నట్టు ఉంది. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధపడేటట్టు ఉంది. ఆయన మాటలు కూడా అలానే ఉన్నాయి. వైసీపీకి పోరాటాలు కొత్త కావు అన్నమాటలతో సరికొత్త సంకేతాలు వస్తున్నాయి. అయితే అది జగన్ అనుకున్నంత ఈజీ కాదు. అయితే కాంగ్రెస్ వంటి మహా వ్రుక్షాన్ని కూకటివెళ్లతో జగన్ పెకిలించారు. ఇప్పుడు కూడా ధైర్య కూడదీసుకొని పోరాడాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల్లో వైసీపీకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది. సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ల వరకు.. కౌన్సిలర్ల నుంచి కార్పొరేటర్ల వరకు.. మున్సిపల్ చైర్మన్ ల నుంచి నగరపాలక సంస్థ మేయర్ల వరకు.. ఎమ్మెల్సీ నుంచి రాజ్యసభ స్థానాల వరకు ఆ పార్టీ దే పై చేయి. వైసీపీకి ఇప్పుడు ఘోర ఓటమి ఎదురు కావడంతో వారంతా పార్టీలో కొనసాగుతారా? ఉండే పరిస్థితి ఉందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో కెసిఆర్ కు ఎదురైన పరిణామాలే ఇక్కడ జగన్ కు ఎదురవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్ కూడా పార్టీని వీడారు. దాదాపు అన్ని జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ లు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు ఏపీలో సైతం స్థానిక సంస్థల ప్రతినిధులు తప్పకుండా టిడిపిలోకి క్యూ కడతారు. వారి వెంట కేడర్ సైతం ఖాళీ అవుతుంది. దీని నుంచి జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.
కేసులు సైతం జగన్ ను వెంటాడుతాయి. ఇప్పటికే అవినీతి కేసుల్లో బెయిల్ పై జగన్ ఉన్నారు. కోర్టుకు హాజరు విషయంలో మినహాయింపు ఉంది. ముఖ్యమంత్రిగా పాలనలో బిజీగా ఉండడంతో తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే ఈ మినహాయింపు కోర్టు రద్దు చేసే అవకాశం ఉంది. ప్రతివారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనికి తోడు గత ఐదేళ్లుగా తీసుకున్న నిర్ణయాలపై, పాలనలో లోపాలపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే అరెస్టు విషయంలో మాత్రం చంద్రబాబు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే అవకాశం ఉంది. తన అరెస్టు ద్వారా టిడిపి పై సానుభూతి వచ్చిన విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే జగన్ పై కేసులు వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తారే కానీ.. అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలకు దిగరని తెలుస్తోంది.
ఈ ఐదేళ్ల పాలనలో జగన్ కు తప్పకుండా ఇబ్బంది పెడతారు. 2029 ఎన్నికల నాటికి వైసీపీని ఎంతలా నిర్వీర్యం చేయాలో అంతలా చేస్తారు చంద్రబాబు. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజనను తనకు అనుకూలంగా మార్చుకుంటారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత 225 గా మారనున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పనుండడంతో తనకు అనుకూలంగా నియోజకవర్గాలను మార్చుకుంటారు. 2009లో తెలుగుదేశం పార్టీకి ఇదే మాదిరిగా కాంగ్రెస్ దెబ్బతీసింది. టిడిపి బలమైన నియోజకవర్గాలను పునర్విభజనలో భాగంగా విభజించింది. ఇప్పుడు చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించినన్నారు. జగన్, పెద్దిరెడ్డి వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం విభజిస్తారు. రిజర్వ్డ్ నియోజకవర్గాలుగా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే జగన్ కు కోలుకోలేని దెబ్బ. మరోవైపు ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో జగన్ కు భద్రత భారీగా తగ్గనుంది. దాంతో కూడా ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇలా ఎలా చూసినా జగన్ కు మున్ముందు కష్టాలే కనిపిస్తున్నాయి.
అయితే తొలుత కార్యాలయం మార్పుతో ఇక ప్రజల్లోకి అని జగన్ సంకేతాలు పంపారు. ఎన్డీఏ కూటమి ఘనవిజయం.. ఆ పార్టీ కేవలం11 సీట్లకే పరిమితం అవడంతో వైసీపీ కేడర్ నైరాశ్యంలో మునిగిపోయారు.దీంతో కేడర్‌కు అందుబాటులో ఉండేలా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డి పలుమార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రస్తుతం ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేయాలని జగన్ రెడ్డి నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకోసం కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.తాడేపల్లిలోని జగన్ నివాసం పక్కనున్న క్యాంపు కార్యాలయానికి వైసీపీ కార్యాలయం మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు సీఎం క్యాంపు ఆఫీసుగా ఉన్న భవనం.. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంగా మారనున్నది. జూన్ 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించేలా కీలక నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కంప్యూటర్లు, ఇతర సామగ్రి తరలించడానికి వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.మొత్తానికైతే పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని జగన్ భావిస్తున్నారన్న మాట.