చంద్రబాబు తెగించేసారా? కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారా? సంక్షేమ పథకాలు అమలు చేయలేనని సంకేతాలు ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమమని హామీ ఇచ్చారు బాబు. సంపద సృష్టించి మరీ ఇస్తామని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం హామీల అమలు ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. కానీ 8 నెలలు సమీపిస్తోంది. మరో నాలుగు నెలల్లో ఏడాది పాలన పూర్తవుతుంది. కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఇంకా అమలు చేయలేదు. పింఛన్ మొత్తాన్ని పెంచారు. గత ఏడు నెలలుగా అందిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు రకరకాల కొర్రీలు పెట్టి పింఛన్ల కోతకు సిద్ధపడుతున్నారు. అదే సమయంలో కొత్త పింఛన్ల ఊసు లేకుండా పోతోంది. గ్యాస్ పథకం అమలు చేశారు. ఒక్క గ్యాస్ బండ ఉచితంగా అందించారు. అంతకుమించి ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారు.
అయితే సీఎం చంద్రబాబులో ఒక తెగింపు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో తాము అమలు చేయలేమన్న సంకేతాలు పంపించారు ఆయన. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీశారని.. అందుకే అమలు చేయలేకపోతున్నామని తేల్చి చెప్పారు. అయితే హామీ ఇచ్చినప్పుడు ఆయనకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా? మరి అటువంటి అప్పుడు జగన్ సర్కార్ ఎలా ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో పథకాలను అమలు చేసింది. అమ్మ ఒడిని అమలు చేసి చూపింది. రైతు భరోసా అందించి రైతుల కళ్ళల్లో ఆనందం నింపింది. మహిళలకు ఆసరాగా నిలిచింది. ఆటో కార్మికులకు వాహన మిత్ర అందించింది. ఇలా ప్రతి పథకం క్యాలెండర్ ప్రకారం అందించగలిగింది జగన్ సర్కార్.
సంక్షేమానికి వ్యతిరేకం చంద్రబాబు. ఈ విషయం ప్రజలకు తెలుసు కూడా. అయినా ఓటేశారు. మధ్యతరగతి తో పాటు ఎగువ మధ్యతరగతి ప్రజలు, ఉన్నత వర్గాల వారు ఏకపక్షంగా మద్దతు ఇచ్చారు. ఆపై మూడు పార్టీల కూటమి. అందుకే కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అయితే సంపద సృష్టించి ఇస్తానన్న చంద్రబాబు ఇప్పుడు.. వైసిపి సర్కార్ మాదిరిగా అప్పుల పైనే ఆధారపడుతున్నారు. అసలు సంపద సృష్టికి సరైన మార్గం లేకుండా జగన్ విధ్వంసం సృష్టించారని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పథకాలు అమలు చేయలేనని ప్రజలకు తెలుసు.. అయినా తనను గెలిపించడాన్ని సరిగ్గా గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. అందుకే పథకాలు అమలు చేయడంలో వెనుకడుగు వేస్తున్నారన్నది విశ్లేషకుల అభిప్రాయం.
2024 జూన్ లో అధికారంలోకి వచ్చింది కూటమి. అదే నెలలో విద్యాసంవత్సరం ప్రారంభం అయింది. కానీ పిల్లల చదువు ప్రోత్సాహం లేకుండా పోయింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయల చొప్పున చదువుకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడంలో మాత్రం చంద్రబాబు వెనుకడుగు వేశారు. అదే జూన్లో ఖరీఫ్ ప్రారంభమైంది. అన్నదాత సుఖీభవ పేరిట ప్రతి రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం 6 వేల రూపాయల చొప్పున సాయం అందిస్తోంది. దానికి 14000 కలిపి అందిస్తామని చెప్పుకోచ్చారు చంద్రబాబు. కానీ అమలు చేయలేకపోయారు. అయితే అంతటి భారీ స్థాయిలో హామీలు ఇచ్చి అమలు చేయడం లేదంటే.. చంద్రబాబు ఒక తెగింపునకు వచ్చేసారన్నమాట.
అయితే తేల్చుకోవాల్సింది ప్రజలే. సంక్షేమ పథకాలు అమలు చేసే జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారు. సంక్షేమానికి ఇష్టపడని చంద్రబాబుకు అందరం ఎక్కించారు. అప్పట్లో ఎందుకండీ ఈ పథకాలు అన్నవారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. అప్పట్లో దండిగా పథకాలు తీసుకునే సామాన్యులు చంద్రబాబు సర్కార్ పై ఆగ్రహంగా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు