పనిచేయి ప్రతిఫలం ఆశించకు.. ఇది జనసేన లో వస్తున్న ఫార్ములా. గత పదేళ్లుగా జెండా పడుతూనే ఉన్నారు. జనసేనకు జై కొడుతూనే ఉన్నారు. అబ్బబ్బే ఒక్క జనసేనకే కాదు టిడిపి తో పాటు బిజెపికి జై కొట్టాల్సిందేనని అధినేత పవన్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు? తమకు ఒక మనస్సాక్షి ఉంటుంది కదా అంటూ జన సైనికులు తెగ బాధపడుతున్నారు. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రకటన చేస్తున్నారు. జనసైనికులను కంట్రోల్ చేస్తున్నారు. అయితే అది తనకు తానుగా చేస్తే పర్వాలేదు. అందులో కూడా తమను కంట్రోల్ చేసేలా మరొకరు పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా లోకేష్ అర్హుడు అంటూ ఒకరు. అదేంటి టిడిపిని అధికారంలోకి తేవడంలో లోకేష్ పాత్ర ఉంది. ఆయన ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే యోగ్యత ఉంది. అంటూ ప్రకటనలు, ఆ పై తండ్రి కొడుకులకు భజనలు సైతం ప్రారంభం అయ్యాయి. అయితే మీకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఉంటే.. మా పార్టీ వారికి పవన్ ఈ రాష్ట్రానికి సీఎం కావాలని ఉందని జనసేన నేతలు కుండ బద్దలు కొట్టారు. అప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా రచ్చ నడుస్తోంది. కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి. సోషల్ మీడియా వేడెక్కుతూనే ఉంది. అనేక రకాల అనుమానాలతో పాటు విశ్లేషణలు కూడా కొనసాగాయి. ఇటువంటి తరుణంలో కూటమిపై ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ప్రారంభమైంది. అప్పుడే నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. కంట్రోల్ గా ఉండాల్సిందేనని జన సైనికులకు తేల్చి చెప్పారు. కంట్రోల్ దాటిపోతే చర్యలు తప్పవని కూడా సంకేతాలు పంపారు. కూటమి మరి కొన్నేళ్లపాటు సాగాలని.. సమన్వయంతో ముందుకు సాగాల్సిందేనని మిగతా రెండు పార్టీల శ్రేణులకు సైతం విజ్ఞప్తి చేశారు. అయితే టిడిపి తో పాటు బీజేపీ కష్టంలో ఉంటే ఆ పార్టీల నాయకత్వాలు స్పందించిన సందర్భాలు తక్కువ. కానీ అంతకుమించి అన్నట్టు పవన్ కళ్యాణ్ స్పందిస్తుంటారు. అంతలా ఆయన పై ప్రభావం చూపుతుంటాయి తెలుగుదేశంతో పాటు బిజెపి.
ఆది నుంచి అంతే. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ వైఖరి అదే. క్షేత్రస్థాయిలో కష్టపడేది జనసైనికులు. వారి నుంచి ఏదైనా డిమాండ్ వస్తే అధినేత పరిగణలోకి తీసుకోరు. పైగా తిరిగి వారిని కంట్రోల్ చేస్తారు. ఏళ్ల తరబడి వారు జండాలు మోస్తారు. వారికి వనగూరే ప్రయోజనాలు ఏమీ లేవు. ఈ ఎన్నికల్లో 60 నుంచి 70 సీట్లు డిమాండ్ చేయాలని జనసైనికులు కోరారు. అప్పుడే తమ ఉనికి చాటుకోవచ్చని భావించారు. అయితే మనకు అంత సీన్ లేదని.. 20 నుంచి పాతిక సీట్లు చాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పోనీ మంత్రి పదవులు ఎక్కువ తీసుకోవాలని కోరారు పార్టీ శ్రేణులు. అది ఎలా అవుతుంది.. ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒకరు చొప్పున మంత్రి ఉంటారని ఫార్ములా తీసుకొచ్చారు. ఈ విషయంలో ఎటువంటి ప్రకటనలు వద్దని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన తరువాత అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. అయినా సరే అధినేత పవన్ తమనే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుండడానికి మాత్రం జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఈ రాష్ట్రానికి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని తేనె తుట్ట రేపింది టిడిపి. కేవలం డిప్యూటీ సీఎం ఒక్కటే సరిపోదు.. సీఎం పోస్టు కూడా కావాల్సిందేనని తెలుగు తమ్ముళ్లు ప్రకటనలు చేశారు. మధ్యలో వైసీపీ ఎలానో కలుగజేసుకుంటుంది. ఆ పార్టీకి ఇప్పుడు అర్జెంటుగా కూటమిలో విభేదాలు రావాలి. పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం కలగాలి. అందుకే సోషల్ మీడియాలో దీనిని రెట్టింపు ప్రచారం చేసింది. అయితే వైసీపీ మాట అటు ఉంచితే.. టిడిపి వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి నడిచింది. కానీ ఎంత జరిగిన లోకేష్ తో పవన్ భాయ్ భాయ్ అంటూ చెట్టపట్టాలు వేసుకున్నారు. దీంతో జనసైనికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తమ పరిస్థితి ఎప్పుడు ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పార్టీ కోసం, పార్టీ అధినేత కోసం మాట్లాడితే.. క్రమశిక్షణ పేరిట తమను కట్టడి చేస్తున్నారని వాపోతున్నారు. తమ ఆర్తనాధాన్ని అధినేత ఎప్పుడు గుర్తిస్తారో అని ఎదురుచూస్తున్నారు