Sunday, January 26, 2025

Hydrabad: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పదా?

- Advertisement -

Hydrabad: రాష్ట్రంలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రానుందా? అనివార్యమా? ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నెల రోజుల్లో వారిపై చర్యలు విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు శాసనసభ స్పీకర్ ను ఆదేశించింది. అయితే ఈ జాబితాలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా.. ఒకచోట మాత్రం ఉప ఎన్నిక అనివార్యమని నిపుణులు సైతం చెబుతున్నారు. దీంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హైటెన్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని అంతా ప్రచారం జరుగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం బీఆర్ఎస్ కేవలం ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం కావడంతో దానం నాగేందర్ ఆలోచన తీరులో మార్పు వచ్చింది. వెంటనే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీలో చేరిన దానం నాగేందర్ తన హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్న దానం నాగేందర్ కు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల రూపంలో పెద్ద సవాల్ వచ్చి పడింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన దానం నాగేందర్ కు ఇప్పుడు ఇదే పెద్ద ఇష్యూగా మారింది.అనర్హత వేటుకు కారణమవుతోంది.

వాస్తవానికి విపక్షం నుంచి అధికార పక్షంలోకి జంపింగ్ లు కామన్.గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరారు. కానీ వారికి రానీ సమస్య ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో వచ్చి పడింది. ఇప్పుడు ఇదే దానంకు పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒక దానం నాగేందర్ మినహా మిగితా వారికి సాంకేతికంగా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దానం నాగేందర్ కు మాత్రం చిక్కులు తప్పకపోచ్చనేది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగానలో ఇదే హాట్ టాపిక్ కూడా.

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్ గా ప్రకటించడం, దానిని సమర్థించడంతో కాంగ్రెస్ వ్యూహం బయటపడింది. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతోనే పీఏసీ ఛైర్మన్ గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. అంటే మిగితా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పే అవకాశం లేకపోలేదు. దీంతో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించబడుతారు. అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా.. కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తిస్తుందా అనేది సందేహంగా మారింది. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అందుకు గాను దానంపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

హైకోర్టు కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నెల రోజుల్లో నిర్ణయం ప్రకటించమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో ఆలోచన చేస్తున్నట్టు టాక్‌. ఇందులో భాగంగా ఇప్పటికే దానం నాగేందర్ కు సంకేతాలు కూడా ఇచ్చినట్టు సమాచారం. ఉప ఎన్నికకు సిద్దంగా ఉండాల్సిందిగా దానం నాగేందర్ కు కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందట. స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నాగేందర్ తో రాజీనామా చేయించాలా లేక స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే వరకు వేచి చూడాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఏది ఏమైనా ఉప ఎన్నికను మాత్రం ఎదుర్కోక తప్పదు అన్న భావనలో కాంగ్రెస్ ఉందట. ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలనే కృత నిశ్చయంతో ఉందని గాంధీ భవన్‌ వర్గాలు అంటున్నాయి. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యూహాలు సిద్దం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక వ్యూహాంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలిసింది. వీలైనన్ని అభివృద్ది కార్యక్రమాలు ఇక నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే చేపట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యినట్టు సమాచారం.మొత్తానికి ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!