Bigg Boss Telugu 8 : బిగ్‌బాస్ చూసేవారికి ఇది వినోదాత్మక కార్యక్రమం.. కానీ కంటెస్టెంట్లకు మాత్రం వంద రోజులు అది ఒక జైలే. ఈ విషయం చాలా మంది కంటెస్టెంట్లు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. హౌసులో వారు పడే ఆకలి బాధలు వర్ణణాతీతం. అందుకే ఇంట్లోకి వెళ్లాలనుకునే వారు అంతా సిద్ధమైన తర్వాతే ఇంట్లోకి అడుగుపెడతారు. హౌసులోకి అడుగుపెట్టిన తర్వాత చాలా మందికి తమ కుటుంబసభ్యులు అందుకే గుర్తుకొస్తారు. భార్య, పిల్లల గుర్తులు వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. దీంతో సడన్ గా హౌస్ నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఒక్కసారి అగ్రిమెంట్‌పై సంతకం చేసి ఇంట్లోకి అడుగుపెడితే… మనకు నచ్చకపోతే హౌసు నుంచి బయటకు వెళ్లలేం.. ప్రేక్షకులు పంపించి వేస్తే తప్ప అక్కడి నుంచి వెళ్లడానికి వీలు కాదు. అయితే గతంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఒకరు హౌస్‌లో ఉండలేక గోడ దూకి పారిపోవాలని భావించారని.. అయితే హీరో నవదీప్ రంగంలోకి దిగిన తర్వాత అసలు విషయం తెలిసి తిరిగి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇంతకు అది ఏ సీజన్? ఆ కంటెస్టెంట్ ఎవరో చూద్దాం..
2017లో తొలిసారి బిగ్ బాస్ సీజన్ 1 ప్రారంభం కాగా.. ఆ సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. అందులో 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించగా వారిలో కమెడీయన్ ధనరాజ్ ఒకరు. గతంలో జబర్దస్త్ షోలో కమెడియన్‌గా పనిచేసిన ఈయన బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టడంతో ఆయన క్రేజ్ పెరిగింది. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇటీవల క్లారిటీ ఇచ్చాడు ధన్‌రాజ్. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా.. జబర్దస్త్ ఇంత నేర్పిస్తే బిగ్ బాస్ దానికి 100 రెట్లు ఎక్కువ నేర్పించిందా అని హోస్ట్ అడిగితే, దానికి ధనరాజ్ మాట్లాడుతూ.. వీళ్లు పంపించే వరకు మనం వెళ్లేది లేదు. ఒక్కరోజు ఉండలేక గోడ ఎక్కాను. కానీ నవదీప్ నన్ను చెడగొట్టాడు. ఒకరోజు బిగ్ బాస్ లోకి వెళ్తున్నాం అంటే నిజమేనా అంటే అవునన్నాడు. ఉండగలమా అని నేను అడిగితే.. నచ్చితే ఉంటాం లేకపోతే వచ్చేస్తామన్నాడు. దాంతో నచ్చకపోతే వచ్చేయొచ్చేమో అనుకొని, నేను కూడా వెళ్లడానికి ఓకే చెప్పాను. ఇక చాలాసార్లు హౌస్ లో ఉన్నప్పుడు కూడా వెళ్లిపోదామని ఎన్నోసార్లు బిగ్ బాస్ తో చెప్పాను. కానీ రిప్లై వచ్చేది కాదు. ఆ తర్వాత అర్థమైంది.. ఓహో.. ఇతడు ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నాడో , అప్పుడే మాట్లాడుతాడు. మనం అడిగినదానికి సమాధానం చెప్పడు అని అర్థమయింది.
అయితే ఓ రోజు స్మోక్ రూమ్ ఏరియాలో బట్టలు ఆరవేస్తుంటే అక్కడ గోడ ఎక్కి బాయ్ బాయ్ సీ యూ అన్నారు. నవదీప్ ఇప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అక్కడికి వచ్చాడు. ఎందుకు గోడక్కవ్ అని అడిగాడు. నేను దూకి వెళ్ళిపోతున్నా అన్నాను. అప్పుడు అగ్రిమెంట్ చదవలేదా అని అడిగాడు.. లేదు ఏముంది ఇస్తే సంతకం చేశాను అని చెప్పాను. దాంతో మనకు మనం వెళితే రూ.25లక్షలు చెల్లించాలని తెలుసా ? అని అన్నాడు. దెబ్బకు భయంతో ఇటువైపు దూకేశాను అంటూ చెప్పుకొచ్చాడు.