YSRCP: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్సీపీ బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాల వారీగా పార్టీలో నియామకాలు చేపడుతూ కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను కూడా ఖరారు చేస్తున్నారు. ఈ మేరకు జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
తాజా నియామకాల్లో భాగంగా మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్‌ని వైఎస్ జగన్ నియమించారు. మొదటి నుంచి పార్టీలో కీలక పాత్ర పోషించిన కృష్ణదాస్‌ని ఆత్మీయంగా దాసన్న అని పిలుస్తారు. కాగా, దాసన్న కుటుంబం వైఎస్ కుటుంబానికి ఆప్తులుగా పేరుపొందారు. పార్టీ ఆవిర్భావం నుంచీ దాసన్న సతీమణి పద్మప్రియ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ధర్మాన గత ప్రభుత్వంలో మంత్రిమండలి నుంచి మళ్లీ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మళ్లీ ఆయనకే పట్టం కట్టడం విశేషం. ఇదిలా ఉంటే.. విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.
కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులైన సంగతి తెలిసిందే.