Balineni srinivas Reddy: ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నిన్న ఆయన భేటీ అయ్యారు. ఇక తాను పార్టీలో చేరతానని అడిగిన వెంటనే ఒప్పుకుని తనను ఆహ్వానించినందుకు పవన్ కల్యాణ్‌కు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో గంటకు పైగా జరిగిన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని త్వరలోనే ఒంగోలులో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు వెల్లడించారు. తనతో పాటు ఒంగోలులోని పలువురు నేతలు కూడా జనసేనలో చేరతారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీలో పనిచేస్తానని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోయి జనసేన అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు పార్టీ మారుతుండడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తిరుమల ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివాదాస్పద కామెంట్స్ చేయడంపై కౌంటర్ ఇచ్చేందుకు జగన్ మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు సీనియర్ నాయకులు పార్టీ మారుతున్నారని మీ స్పందన ఏంటని జగన్ ను ప్రశ్నించారు.
“యా సీనియర్లు పోతాండారు. ఎవరు పోతాండారు? ఏమవుతాంది?” అంటూ కడప యాసలో జగన్ స్పందించారు. మీడియా ప్రతినిధులు ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రస్తావించారు. “పోనీలే. ఏమైతాది. ఇంకొకరు వస్తారు” అని జగన్ చెప్పుకొచ్చారు. లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడని గుర్తించుకోవాలని జగన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే వుందో సూపర్ సిక్స్లు, సెవెన్లు వీళ్ల అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు, వీళ్ల మోసాలపై ప్రజలు కోపగించుకున్నప్పుడు, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుందని జగన్ వివరించారు. నాయకులు పార్టీ మారినంత వైసీపీకి పోయేదేమీ లేదని జగన్ స్పష్టంగా చెప్పారు. వైసీపీ నాయకుల పార్టీ మార్పు ఏమంత పెద్ద విషయం కాదన్నట్టు, ఆయన లైట్ తీసుకున్నట్టు తన మాటల ద్వారా చెప్పారు. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్వయానా జగన్‌కు దగ్గరి బంధువు. జగన్లో మార్పు రాకపోవడం వల్లే పార్టీ మారినట్టు బాలినేని చెప్పిన సంగతి తెలిసిందే.
కానీ బాలినేనిని తమ పార్టీలో చేర్చుకోవాలంటే ఈవీఎం ల అవకతవకల గురించి తాను పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ బాలినేనిని కోరినట్లు సమాచారం. అలాగే ఒంగోలులో ఆయన అనుచరులు మరియు క్యాడర్ ఆయనతో పాటు పార్టీ వీడటానికి ఇష్టపడటం లేదంట. ఇటు జగన్ కూడా బలినేనిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి సముఖత చూపించారు అని మొత్తానికి బలినేనికి జనసేనలో ఇంకా చేరకుండానే బిగ్ షాక్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.