EVM-SCAM: ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు, సందేహాలు పెరిగిపోయి ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేసి మరియు కేసులు పెట్టడం మనందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు వక్ర భాష్యం చెబుతూ ఎన్నికల సంఘం రూపొందించిన టెక్నికల్ స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (టీ-ఎస్వోపీ)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి కూడా తెలిసిందే. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేయకుండా మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులిపేసుకునే దిశగా ఎన్నికల సంఘం అడుగులు వేసింది. మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ బయట పడే అవకాశమే లేదన్నది నిపుణుల మాట. ఈవీఎంలలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి పరిశీలిస్తే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ వెలుగు చూసే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు. మాక్ పోలింగ్ లో కేవలం ఆయా మిషన్లు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని మాత్రమే రూఢీ చేస్తుందని, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయదని స్పష్టంగా చెబుతున్నారు.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీ, పరిశీలన చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ బయట పడుతుందన్న ఆందోళనతోనే ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. తనిఖీ, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్‌ను తెర పైకి తెచ్చారని వైసీపీ నాయకులు ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఓటింగ్ యంత్రాల పరిశీలన, తనిఖీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్ పోలింగ్ ఆదేశాలపై న్యాయ పోరాటానికి దిగిన విషయం మనకు తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు ఆయన న్యాయవాది వివేకానంద తెలిపారు.
అయితే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కేసు పెట్టి ఎవరి పైన అయితే పోరాడారో ఇప్పుడు వారి దగ్గరికే అవంతా వదిలేసి వెళ్లి చేరారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. దీంతో ఈవీఎంల గోల ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈవీఎంల అంశంలో తమకు ఎలాంటి అడ్డంకి రాకూడదనే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తమ కూటమిలో చేర్చుకున్నారని వైసీపీ ఇప్పటికే ఆరోపించింది. కూటమి ప్రభుత్వం మాత్రం కావాలనే ఈ అంశం తెర మీదకి రాకుండా విజయవాడ వరదలు అంటూ కొంత కాలం గడిపేసింది. ఇప్పుడు ఏకంగా ప్రజలు కలియుగ దైవంగా భావించే తిరుమల వేంకటేశ్వరుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తోంది. మొత్తానికే ఈవీఎంల అంశం కనుమరుగయ్యేలా ప్రజలు మరచిపోయేలా చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే బాలినేని లేకపోతే ఏంటని రాష్ట్ర ప్రజలకి జరిగిన అన్యాయం తరపున వైసీపీ ఎప్పటికీ పోరాడుతుందని ఈవీఎంల కేసు విషయంలో వైసీపీ సుప్రీమ్ కోర్టుకి వెళ్లనున్నట్లు పలువురు పార్టీ నేతలు తెలిపారు. దీని గురించి త్వరలోనే విచారణ జరగనున్నట్లు వారు వెల్లడించారు.