Ys Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పంథా మార్చాల్సిన సమయం దగ్గర పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కొందరు పార్టీ సీనియర్లు వైసీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మరికొందరు ఇప్పటికే జగన్‌కి గుడ్ బై చెప్పేసి వలస బాట కూడా పట్టేశారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయంగా గత వైసీపీ ప్రభుత్వంలో సుపరిపాలన అందించిన వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు, తర్వాత కూడా అలాగే ఉన్నారని, ఓటమి తర్వాత అయినా ఇప్పటివరకు ఆయనలో మార్పు కనిపించడం లేదన్నది వైసీపీలో సాగుతున్న చర్చ. తనదైన విజన్‌తో ముందుకు సాగినా.. పార్టీలోని కొందరు రాజకీయ నమ్మక ద్రోహులను నమ్మి వైసీపీని ఈ రోజు ఈ పరిస్థితికి తెచ్చారన్న వాదన కూడా ఉంది. ఇప్పుడు అదే పెద్ద మైనస్‌గా మారిపోయిందని కూడా పార్టీలో చర్చించుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల్లో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యి అధికార పీఠాన్ని దక్కించుకున్నాయని బలంగా వినిపిస్తున్న మాట. అందుకే ఇప్పటికైనా జగన్ తన పంథా మార్చుకోవాలని అంటున్నారు.
ప్రతి నియోజకవర్గానికి జగన్ లాంటి ఒక నాయకుడిని నిలబెట్టి నిలదొక్కుకుని ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదన్నది వాస్తవం. కానీ వైసీపీ అండ చూసుకుని ఒకప్పుడు పదవులు అనుభవించిన బడా నేతలు సైతం ఓటమి తర్వాత మెల్లగా జారుకున్నారు. ప్రస్తుతం ఉన్న కొందరు నేతలు కూడా ఎవరూ నోరు విప్పడం లేదు. ఎవరిని కూడా నోరు విప్పనివ్వడం లేదని, అంతా నేనే చూసుకుంటాను అన్నట్టుగా జగన్ కూడా ఇదే సూత్రం పాటిస్తున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా తమ ధీటైన గళం వినిపించి బలంగా ఎదుర్కొనే నాయకులు ఎవరూ ప్రస్తుతం పార్టీలో లేకుండా పోయారనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఇకనైనా తమ నాయకుడు నిజానిజాలు గ్రహించి తన పంథా మార్చుకుని పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని వైసీపీ నాయకులు ఎదురుచూస్తున్నారు.