Friday, October 4, 2024

Revanth reddy: సీఎం సోదరుడు విషయంలో తగ్గిన హైడ్రా..ఎందుకలా?

- Advertisement -

Revanth reddy: హైడ్రా తోక ముడుస్తోందా? మునుపటిలా దూకుడు ప్రదర్శించడం లేదెందుకు? మొన్నటి వీకెండ్ లో పెద్దగా పని చెప్పలేదు ఎందుకు? ఇప్పడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. అక్రమార్కుల పాలిట సింహ స్వప్నం హైడ్రా అంటూ సీఎం రేవంత్ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. కానీ సీఎం సోదరుడికి హైడ్ర నోటీసులు ఇచ్చి రోజులు, వారాలు దాటుతున్నా..కనీస చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సినీ స్టార్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతతో హైడ్రా సంచలనంగా మారింది. కానీ అక్కడి నుంచి సంచలనాల కంటే సామాన్యులపైనే తన ప్రతాపాన్ని చూపింది. ప్రారంభంలో అహా ఓహో అన్నవారే..ఇలా చేస్తున్నారేంటి? అని ప్రశ్నించే స్థితికి పరిస్థితి దాపురించింది.

హైడ్రా విశ్వ రూపం చూపుతుందని భావించారు. కానీ ఇంతలోనే కొంత సైలెంట్ అయ్యింది. పెద్దల విషయంలో మినహాయింపులు ప్రారంభమయ్యాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా తీరు మొదట్నుంచీ అనుమానంగా ఉంది. సీఎం సోదరుడి విషయంలో ఇది స్పష్టంగా తేలిపోయింది. అమర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలో ఉండే సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడి ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. కానీ ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూడలేకపోయారు. కూల్చివేతలు దేవుడెరుగు.. కనీసం ఆయా నిర్మాణాల ఆక్రమణల విస్తీర్ణం కూడా తేల్చలేకపోయారు. సీఎం సోదరుడికీ నోటీసులు ఇచ్చామంటూ చెప్పుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం వెనకడుగు వేసినట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే హైడ్రా నడుస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి.

అయితే హైడ్రా కమిషనర్ పెద్ద పెద్ద బీరాలు పలికారు. చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల విషయంలో దూకుడుగా వ్యవహారిస్తున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. సామాన్యుడు నిర్మించుకున్న ఇండ్లపైనే ప్రతాపం చూపుతుందనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. బిల్డర్లు, డెవలపర్లు చేసే తప్పిదాలతో సామాన్యుల కలల సౌధాలను కండ్ల ముందే కూలివేస్తున్నారు. గుండెలు బాదుకొని.. కంటనీరు తెచ్చుకుంటున్నా.. కనికరం లేకుండా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. కానీ రాజకీయ పలుకుబడితో చెరువులను చెరబట్టిన సంపన్నుల నిర్మాణాల జోలికిపోయే ధైర్యం మాత్రం చేయటం లేదు. ఎన్‌ కన్వెన్షన్‌ లాంటి నిర్మాణాలను కూల్చివేసి హడావుడి చేసినా.. అమర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ లాంటివి హైదరాబాద్‌లో లెక్కకు మించి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు వాటిని గుర్తించింది లేదు. ఒకవేళ గుర్తించినా.. నోటీసులు చేరుతున్నాయి కానీ, బుల్డోజర్లు మాత్రం దరికి రావటంలేదు.

ప్రధానంగా ఇప్పుడు సీఎం రేవంత్ సోదరుడి ఇంటి విషయంలో చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
నిబంధనలు అతిక్రమిస్తే ఎంతపెద్ద వారైనా, లీగల్‌ ఎదుర్కొని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని బీరాలు పోయిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఈ సొసైటీ విషయంలో దూకుడు ఎక్కడ? అని హైదరాబాద్‌వాసులు ప్రశ్నిస్తున్నారు. జల వనరులను నిర్వీర్యం చేసిన సంపన్నవర్గాల నిర్మాణాలను ఎందుకు కూల్చడం లేదని నిలదీస్తున్నారు. నోటీసులు లేకుండానే నిర్మాణాలు కూల్చివేతలకు దిగుతున్న హైడ్రా.. సంపన్నులు, రాజకీయ నేతలు నిర్మించుకున్న భవంతుల విషయంలో అదే తీరుగా ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే హైడ్రా చర్యలు ఇప్పడు తెలంగాణ వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీయడం విశేషం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!