Tuesday, October 8, 2024

Hyderabad: హైడ్రాకు సామాన్యుల నుంచి నిలదీతలు.. అందుకే ఆధారాలతో కూల్చివేతలు

- Advertisement -

Hyderabad: హైదరాబాద్ లో హైడ్రా దుమ్ము దులుపుతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తోంది. వేల కోట్ల రూపాయల భూములు ప్రభుత్వపరం అవుతున్నాయి. అయితే అక్కడక్కడ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రభుత్వం సైతం అలెర్ట్ అయ్యింది. పక్కా ఆధారాలతో కూల్చి వేయాలని హైడ్రాకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆధారాలను సేకరించే పనిలో హైడ్రా ఉంది. తప్పుడు నిర్మాణాలని ఆధారాలు దొరికిన మరుక్షణం బుల్‌డోజర్లతో వాలిపోవడానికి హైడ్రా సిద్ధంగా ఉంది. శనివారం సమీపిస్తుండడంతో ఈ వారం పెద్దఎత్తున కూల్చివేతలు ఉంటాయని తెలుస్తోంది.

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బాగా విస్తరించింది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు గతంలో ‘లేక్ వ్యూ’ పేరుతో ప్రాజెక్టులు చేపట్టాయి. లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. చెరువు పక్కన ఏదేనీ కొత్త ప్రాజెక్టు మొదలైందంటే చాలు.. కొనుగోలుదారులు క్యూ కట్టేవారు. హైడ్రా కూల్చివేతలతో ప్రస్తుతం సీన్ మెుత్తం రివర్స్ అయింది. చెరువులు, కుంటల పక్కనే లేక్ వ్యూ అపార్ట్‌మెంట్లు అంటే చాలు జంకుతున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో ఇంటిని కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. లేక్ వ్యూ ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.అయితే ఆ ప్రభావం రెజిస్ట్రేషన్లపై పడుతోంది. హైడ్రా ఎంట్రీ తరువాత పూర్తిగా రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుముఖం పట్టింది.

భాగ్యనగరంలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, చార్మినార్‌ జోన్లలోని పలు చెరువుల సమీపంలో ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ సంస్థలు లేక్‌ వ్యూ ప్రాజెక్టులను నిర్మించాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ ప్రాజెక్టులపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీంతో హైడ్రా రంగంలోకి దిగింది. తాము చెరువును ఆక్రమించలేదనే రియల్ ఎస్టేట్ సంస్థలు వాదన వినిపిస్తుండగా.. ఏళ్ల నాటి చెరువుల పటాలను హైడ్రా నిర్మాణ సంస్థల ముందుంచుతోంది. అయినా కొందరు నిర్మాణదారులు ఆయా స్థలాలను పార్కులు, పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు, సెట్ బ్యాక్ స్థలాలుగా చూపిస్తు్న్నారు.దీంతో పక్కా ఆధారాలతో ఆయా లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్లను కూల్చేందుకు హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. భారీ భవనాలను ఎలా కూల్చాలనే విషయమై బాహుబలి క్రేన్ల నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. ప్రాజెక్టులపై విచారణలు పూర్తయ్యాక కూల్చివేతలను ప్రారంభించనున్నట్లు హైడ్రా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అయితే కొంతమంది రియల్ వ్యాపారులు, అధికారులతో కలిసి చేసిన తప్పిదాలకు ఇప్పుడు సామాన్యులు బలి అవుతున్నారు. కయా కష్టం చేసుకొని చాలా మంది ఇళ్లను కొనుగోలు చేశారు.అటువంటివి అక్రమ నిర్మాణాలని నిర్ధారిస్తున్న హైడ్రా కూల్చివేస్తోంది. అయితే ఈ విషయంలో అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన తప్పదాలకు సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారు. అందుకే హైడ్రా తీరుపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు ఆహ్వానిస్తున్నా.. సామాన్యులు బాదితవర్గాలుగా మిగలడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారు. అనుమతిచ్చిన అధికారులను వదిలి.. నిర్మాణాలు జరిపిన రియల్ వ్యాపారులను వదిలి.. కొనుగోలు చేసిన తమపై ప్రతాపం చూపిస్తారా? అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆధారాలు చూపి అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు హైడ్రా రంగం సిద్ధం చేస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!