Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా పక్షపాతి అన్న విషయం తెలిసిందే. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా శ్రేయస్సుకే ఎప్పుడూ పెద్దపీట వేసేలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జనం గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కష్టం వస్తే ఎప్పుడూ పేదవాడికి అండగా నిలబడే జగన్ గతంలో కూడా తన పాదయాత్రలతో ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్ల సొంత బిడ్డలా ప్రేమను పంచుకున్నారు. ఇదే క్రమంలో నేడు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరద బీభత్సానికి అతలాకుతలమైన పలు గ్రామాల్లో జగన్ ఈ మేరకు పర్యటించనున్నారు. పాత ఇసుకపల్లి, మాధవపురం, నాగులపల్లి, రమణక్కపేటలో పర్యటించి అక్కడి బాధితులను పరామర్శించనున్నారు.
ఏలేరు వరదతో కాకినాడ జిల్లా మొత్తం అస్తవ్యస్తమైంది. అక్కడి ప్రజలను, రైతులను కోలుకోలేని కష్టాల్లోకి నెట్టింది. పట్టించుకోవాల్సిన పాలక యంత్రాంగం చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వరద ఉధృతిపై టీడీపీ కూటమి ప్రభుత్వం ముందస్తు అంచనాకు రాలేకపోవడమే ఇంతటి ఘోర విపత్తుకు కారణమైందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పనున్నారు. ఈ విషయంలో మాత్రం అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ పంథా ఒకేలా ఉండడం విశేషం. కాగా, సొంత నియోజకవర్గమైన పిఠాపురంను వరదలు ముంచెత్తితే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కరోజు మాత్రమే చుట్టపుచూపుగా వచ్చి వెళ్లడం చర్చకు దారి తీస్తోంది. బాధితులకు భరోసా కల్పించడం సంగతి ఇక సరేసరి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగన్ పిఠాపురం పర్యటన ఆసక్తికరంగా మారింది.