TTD: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నానంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. స్వయానా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే దురుద్దేశంతో గత అయిదేళ్లుగా భక్తులు, రాజకీయ సంస్థలు చేస్తున్న ఆందోళనలను జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసిందంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా వైఎస్సార్సీపీ వాటిని తోసిపుచ్చుతోంది. రాజకీయ ప్రతీకారంగా తిప్పికొడుతోంది. దీనిపై జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ అందించిన నెయ్యి పరీక్షల రిపోర్టుల ఆధారంగా తిరుమల లడ్డూ నాణ్యతపై ఆరోపణలు సంధించారు. నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల అవశేషాలు కలిగి ఉన్నాయంటూ ఐఎస్ఓ 17678:2019 ప్రకారం ఎన్డీడీబీ ఈ రిపోర్ట్ ఇచ్చింది. అదే సమయంలో ఈ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ తమ ఘీ టెస్టింగ్ నివేదికలనూ వెల్లడించింది. ఎస్ఎంఎస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ద్వారా రూపొందించిన రిపోర్టులు అవి. తిరుమలకు ఏఆర్ డెయిరీ పంపించిన నెయ్యి కల్తీ కాలేదనే విషయాన్ని స్పష్టం చేశాయి ఆయా రిపోర్టులన్నీ. టీటీడీ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెయ్యి ఉందని తేటతెల్లం చేశాయి.
ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నెయ్యి నివేదికల టైమ్ లైన్‌ను ఒకసారి పరిశీలిస్తే- అందులో పొందుపరిచిన తేదీలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. టీటీడీకి చెందిన వాటర్ & ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ వరుసగా ఈ ఏడాది జూలై 6, 12వ తేదీల్లో నెయ్యి శాంపిల్స్‌ను సేకరించింది. అదేవిధంగా- ఏఆర్ డెయిరీ తమ నెయ్యి శాంపిళ్లను జూన్ 2, జూలై 8వ తేదీల మధ్య టెస్టింగ్ కోసం ఎస్ఎంఎస్ ల్యాబ్‌లకు అయిదుసార్లు పంపింది. ఎస్ఎంఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికలను టీటీడీ అధికారులకు ఏఆర్ డెయిరీ సమర్పించింది. ఈ వ్యవహారం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే చోటు చేసుకోవడం గమనార్హం. ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఈ ఏడాది జూన్ 4వ తేదీన వెలువడిన విషయం తెలిసిందే. చంద్రబాబు, ఆయన మంత్రివర్గం అదే నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. జూన్ 16వ తేదీన టీటీడీ కార్యనిర్వహణాధికారిగా సీనియర్ ఐఎస్ఎస్ అధికారి జే శ్యామలరావును నియమించారు కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎస్ఎంఎస్ ల్యాబ్, టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ నిర్వహించిన కొన్ని పరీక్షలు కొత్త ఈవో నియామకం తరువాతే టీటీడీకి అందాయి. ఎన్‌డీడీబీ రిపోర్టుల విషయానికి వస్తే- నెయ్యికి సంబంధించిన మొదటి రౌండ్ నమూనాలను జూలై 9వ తేదీన సేకరించారు. ఆ తరువాత అదే నెల 17వ తేదీన రెండో రౌండ్ శాంపిల్స్‌ను సేకరించారు. ఈ పరీక్షలకు సంబంధించిన తుది నివేదిక అదే నెల 23వ తేదీన టీటీడీకి అందింది. జూలై 13వ తేదీన టీటీడీకి చెందిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ తన రెండో నివేదికను సమర్పించింది. నాలుగు రోజుల తరువాత. అయితే- బీ. సిటోస్టెరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్‌ను సరిగ్గా గుర్తించలేకపోయింది టీటీడీ ల్యాబ్. దీన్ని గుర్తించే సామర్థ్యం ఈ ల్యాబ్‌కు లేదు.
దీనితో తదుపరి అనాలసిస్ కోసం ఈ నెయ్యి శాంపిల్స్‌ను ఎన్డీడీబీకి పంపించారు. ఈ నెయ్యి మంచి వాసన, రుచిని కలిగి ఉందంటూ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. అదే సమయంలో జూలై 23వ తేదీన ఎన్డీడీబీ ఇచ్చిన తుది నివేదిక మాత్రం దీనికి భిన్నంగా జారీ అయింది. కల్తీ జరిగిందంటూ పేర్కొన్నాయి. శాంపిల్స్ సేకరించే ప్రక్రియలో గానీ, పాలను సేకరించిన ఆవు హార్మోన్లల్లో హెచ్చుతగ్గుల వల్ల గానీ నెగెటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది.
ఈ నివేదిక ఆధారంగా చంద్రబాబు ఈ ఆరోపణలు గుప్పించారు. అప్పటినుంచి ఈ అంశంపై టీడీపీ-జనసేన బీజేపీ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య పతాక స్థాయిలో వాగ్వాదం మొదలైంది. హిందువుల మనోభావాలను కించపరిచేలా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జంతువుల కొవ్వును తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిందటూ అధికార కూటమి ఆరోపిస్తోండగా, వైఎస్‌ఆర్‌సీపీ దీన్ని తిప్పి కొడుతోంది. టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్, ప్రభుత్వం వెల్లడించిన నివేదికలను ఆధారంగా చేసుకుని తమ అనుమానాలు, ప్రశ్నలను లేవనెత్తుతూనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తోంది.
తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ జగన్ సోదరి గవర్నర్‌ను కలిశారు. వైఎస్ జగన్ క్రిస్టియన్ కావడం వల్లే హిందుమతం, టీటీడీని అడ్డుగా పెట్టుకుని ఆయనపై టీడీపీ దాటి చేస్తోందంటూ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ అంశం సున్నితత్వం, తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే సాంకేతికంగా చాలా లోతుగా అధ్యయనం చేయడం తప్పనిసరి. దీనికి ఉన్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓ తటస్థ సంస్థతో పూర్తి స్థాయి, నిష్పాక్షికతతో విచారణ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ముఖ్యమంత్రి పదవికి అప్రతిష్ఠ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని, టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సంద్రభ్మ్గా జగన్ ప్రధాని మోదీని కోరారు.