YSRCP: 2024 సార్వత్రిక ఎన్నికల్లో అతి కొద్ది సీట్లకే పరిమితమై ఓటమి చవి చూసిన వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కంచుకోట లాంటి రాయలసీమ ప్రాంతంలో ఓడిపోవడం కొంచెం నిరుత్సాహపరిచే విషయమే అయినా.. పక్కా ప్రణాళికలతో అన్ని ప్రాంతాల్లో పార్టీ పుంజుకుంటే గెలిచే అవకాశాలు చాలావరకు ఉంటాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ ప్రాబల్యం ఉన్న రాయలసీమతో పాటు గోదావరి జిల్లాల్లో సైతం గెలవాలని ఈ సారి కూటమి నేతలు వ్యూహాలు రచించడంతో రాష్ట్రం ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉంది. దీంతో పాటు జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఏపీ కూడా మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వినిపిస్తున్న వేళ వైసీపీ మళ్లీ సత్తా చాటుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవలి ఎన్నికల్లో కేంద్రంలో అధికారంతో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని మరీ టీడీపీ పావులు కదిపిందనే మాట వాస్తవం. మరోవైపు, రాష్ట్రంలో ఎలాగో జనసేన అండ ఉండనే ఉంది. మరీ ముఖ్యంగా జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ లేకుండా టీడీపీ గెలిచే అవకాశాలు చాలా తక్కువే ఉండేవంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరింత పకడ్బందీగా పార్టీని ముందుకు తీసుకెళ్తే గెలిచే అవకాశాలు పెరుగుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీలో జరిగిన వలసలపై జగన్ ఒక పరిష్కార మార్గాన్ని చూడాలి. మళ్లీ వలంటీర్ వ్యవస్థ ఊసు ఎత్తకుండా ఉంటే మేలనే సలహాలు వినబడుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు ప్రముఖ నేతలు హద్దులు మీరి ప్రతిపక్షంపై వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ చాలా దెబ్బతింది. అలాంటి వారిని ఒక గాడిన పెడితే విజయావకాశాలకు మార్గం ఉండక పోదు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైఫల్యాలను కూడా బయటపెట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకువస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.