Congress-Ysrcp: గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి తర్వాత అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికీ తరగని అభిమానాన్ని మరింత పెంచుకునే దిశగా యోచిస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని వైసీపీ ఓటమికి కారణమైంది. ఒంటరిగా ఎన్నికల సమరంలోకి రాలేక, వైసీపీని ఎదుర్కొలేక టీడీపీ కూటమిగా ఏర్పడి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీకి అయితే వైసీపీతో ఎలాంటి బంధం బలపడే అవకాశం లేదు. దీంతో వైసీపీ మళ్లీ పుంజుకోవాలంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో బలం ఉన్న పార్టీతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. ఈ మేరకు వైఎస్ జగన్ కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలివిడిగా ఉంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం జగన్ బెంగళూరులోనే ఉన్నారు. అక్కడ డీకే శివకుమార్ లాంటి కొందరు ప్రముఖ నేతలతో జగన్ రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. కాగా, ఇటీవలే జగన్ బెంగళూరులో కొందరు కాంగ్రెస్ నేతలకు తన ఇంట్లో విందు ఇచ్చారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశాన్ని లేవనెత్తుతూ టీడీపీ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేస్తుండడంతో జగన్ విందు అంశం నిజమేనని బలపడుతోంది. జగన్ త్వరలోనే ఇండియా కూటమిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలోనే ఈ విందు జరిగిందని కూడా కొందరు అంటున్నారు. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ మధ్య ఎక్కువగా బెంగళూరులోనే మకాం వేస్తున్న జగన్ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం జగన్ స్వయంగా ప్రకటించే వరకు తెలియదు.