Hydrabad: వినాయకచవితి సీజన్ అంటేనే భాగ్యనగరంలో ఒకటే సందడి. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ హైలెట్ గా నిలుస్తుంది. తనలో వేలాది వినాయక విగ్రహాలను ఇముడ్చుకుంటుంది. భారీగా నిమజ్జనోత్సవాలు జరుగుతుంటాయి. అయితే దశాబ్దాలుగా ఈ ఘన చరిత కొనసాగుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది ఆ ఆనవాయితీకి బ్రేక్ పడేలా కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.దీంతో భక్తుల్లో ఒకరకమైన ఆందోళన, ఆవేదన కనిపించింది. అదే సమయంలో ట్యాంక్ బండ్ చుట్టూ ఫ్లెక్సీలు వెలిశాయి. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం నిషేధం అంటూ అందులో రాసి ఉండడంతో మరింత ఆందోళన పెంచింది.
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వస్తే ఆ సందడే వేరు. గణేష్ చతుర్థి నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఇంటా పండుగ వాతావరణం ఉంటుంది. నిమజ్జనాల రోజు భాగ్యనగరంలో ఫుల్ జోష్ ఉంటుంది. ముఖ్యంగా ట్యాంక్ బండ్.. నెక్లెస్ రోడ్డులో గణపతి విగ్రహాల నిమజ్జనం చాలా సందడిగా సాగుతుంది. నగరంలోని దాదాపు ప్రజలంతా నిమజ్జనం రోజు ట్యాంక్ బండ్ వద్దకు చేరుతారు. హుస్సేన్ సాగర్‌లో గణపతి నిమజ్జనాలను ఆసక్తిగా తిలకిస్తారు. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం ఎక్కువ అవుతున్నదనే అభ్యంతరాలు గతంలో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం మొదలైంది. ఇళ్లల్లో మట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నా.. వీధుల్లోని మంటపాల్లో భారీ గణపతులు చాలా వరకు పీవోపీతో చేసినవే. ప్రతి యేటా ఈ పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది.
హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయరాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయడమంటే.. కోర్టును ధిక్కరించినట్టేనని, తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, హుస్సేన్ సాగర్‌లో గణపతి నిమజ్జనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు పరిశీలించింది. అనంతరం, కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కంటెంప్ట్ పిటిషన్ మెయింటెనెబుల్ కాదని పేర్కొంది. కాబట్టి, గతంలో ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియకు సంబంధించి 2021లో కోర్టు ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయని వివరించింది.గతంలో గణపతి నిమజ్జనం సమయంలో అధికారుల చర్యలపై తాము సంతృప్తి చెందామని తెలిపింది. అయితే, పీవోపీ విగ్రహాల తయారీపై తాము నిషేధం విధించలేమని చెప్పింది. కానీ, పీవోపీ విగ్రహాలున తాత్కాలిక పాండ్స్‌లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చని పేర్కొంది.
తాజాగా కోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండ్ పై గణపతి విగ్రహాల నిమజ్జన ప్రక్రియ యథావిధిగా సాగనుంది. గణేష్ నిమజ్జనం చివరి దశలో ధిక్కరణ పిటిషన్ వేయడం సరికాదని పిటిషనర్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో గతంలో లాగే హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం చేసుకునే అవకాశాన్ని తెలంగాణ హైకోర్టు కొనసాగించినట్టయింది. అయితే ట్యాంక్ బండ్ పై వెలిసిన కొన్ని ఫ్లెక్సీలపై వివాదం రాజుకుంటోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, ట్యాంక్ బండ్ పై గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆ ఫ్లెక్సీలపై ఉన్నది. ఈ ఫ్లెక్సీలపై నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా, హైకోర్టు మరోసారి స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలను తొలగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నది. ఒక వేళ ఆ ఫ్లెక్సీలు అధికారులు కాకుండా వేరే వారు ఏర్పాటు చేస్తే వారిపై యాక్షన్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది.