క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ఆదివారం నుంచే షురూ కానుంది. మొదట క్వాలిఫైయింగ్ టోర్నీ జరగనుండగా.. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 సమరం మొదలవుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్న అన్ని జట్లూ వార్మప్ మ్యాచ్ లు, ప్రాక్టీస్ సెషన్స్ తో బిజీగా గడుపుతున్నాయి. అయితే అక్టోబర్ 23న జరిగే భారత్ , పాక్ మ్యాచ్ పైనే అందరి దృష్టీ ఉంది. ఫైనల్ కాని ఫైనల్ గా భావించే చిరకాల ప్రత్యర్థుల సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ పై కేవలం భారత్ , పాక్ ఫ్యాన్సే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ తో మ్యాచ్ పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తుది జట్టుపై తనకో క్లారిటీ ఉందని చెప్పాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ కు తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. రోహిత్ మాత్రం క్లారిటీ ఇచ్చేశాడు. తుది జట్టు ఇప్పటికే ఖరారైందన్నాడు. పాకిస్థాన్ లాంటి చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఉండే ఒత్తిడితో పక్కా ప్లానింగ్ తోనే బరిలోకి దిగుతానని హిట్ మ్యాన్ చెప్పాడు. చివరి నిమిషంలో నువ్వు ఇవాళ ఆడుతున్నావ్ అని జట్టులో ఆటగాడికి చెప్పే అలవాటు తనకు లేదన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి లాస్ట్ మినిట్ రిస్క్ తీసుకోలేనని చెప్పేశాడు. రోహిత్ వ్యాఖ్యలు చూస్తే తుది జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. బూమ్రా రీ ప్లేస్ మెంట్ ఎంపికైన షమీ జట్టుతో కలిసినప్పటకీ… ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో వార్మప్ మ్యాచ్ తర్వాత అతని ప్లేస్ పై క్లారిటీ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. షమీ సీనియర్ బౌలర్ అని, జట్టుకు మేలు చేకూర్చే నిర్ణయాలే తీసుకుంటామన్నాడు.
ఆటలో గాయాలు సహజమేనన్న హిట్ మ్యాన్ గత ఏడాది కాలంగా రిజర్వ బెంచ్‌ను బలంగా చేసే పనిలో పడ్డామని చెప్పుకొచ్చాడు. .పాక్‌తో మ్యాచ్ కంటే ముందు షమీకి 3 నుంచి 4 బౌలింగ్ సెషన్లు ఉంటాయన్నాడు. భారత తుది జట్టు కాంబినేషన్ లో వికెట్ కీపర్ గా పంత్ కంటే కూడా సీనియర్ దినేశ్ కార్తీక్ కు చోటు ఖాయంగా కనిపిస్తోంది.