Thursday, April 25, 2024

అల్లు స్టూడియోస్ వెనక బిగ్ ప్లాన్స్ లీక్

- Advertisement -

సినీ స్టూడియోల నిర్మాణం అంటే సాహసాలతో కూడుకున్నది. హైదరాబాద్ లో అరడజను పైగా పేరొందిన సినీస్టూడియోలు ఉండగా మరో కొత్త స్టూడియోని నిర్మించడం అంటే దాని వెనక పెద్ద మంత్రాంగం ఉంటే కానీ అంతగా సాహసించరు. స్టూడియో స్థానంలో ఒక భారీ కమర్షియల్ మల్టీప్లెక్స్ ని నిర్మించుకోవచ్చు. అది తెచ్చిన ఆదాయం సినీస్టూడియోలు ఎప్పటికీ తేలేవు. కాబట్టి స్టూడియో నిర్మాణం అన్నది ఎంతమాత్రం లాభదాయకమైనది కాదు. కానీ అల్లు ఫ్యామిలీ పని గట్టుకుని హైదరాబాద్ లో భారీ స్టూడియోని నిర్మించడం వెనక మతలబు ఏమిటీ? అన్నదే సస్పెన్స్. ప్రస్తుతం దీనిపై ఆరాలు మొదలయ్యాయి.

రెండు రోజుల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ప్రారంభం కాగా ఆ ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో ఇప్పటికే వైరల్ అయ్యాయి. గండిపేట సమీపంలోని 10 ఎకరాల బహిరంగ స్థలంలో అల్లు ఫ్యామిలీ ఈ స్టూడియోని నిర్మించారు. స్టూడియోలో బహుళ అంతస్తులు ఉన్నాయి. అయితే ఇంత పెద్ద స్టూడియోని లాభనష్టాలకు అతీతంగా నిర్మించడం వెనక లాజిక్ ఏమిటీ? అంటే.. పెద్ద కారణమే ఉందని తెలిసింది.

ఈ స్టూడియో అల్లు ఫ్యామిలీకే చెందిన పాపులర్ తెలుగు ఓటీటీ AHAకు అండగా నిలవాలన్నదే ప్రధాన ఉద్ధేశమని తెలిసింది. ఇక్కడ ఆహా ఓటీటీకి సంబంధించిన ఒరిజినల్ చలనచిత్రాలు వెబ్ సిరీస్ లను అవసరమైన షోల (OTT కంటెంట్)ను చిత్రీకరిస్తారు. వాటి నిర్మాణానంతర పనులు మెజారిటీ పార్ట్ ఇక్కడే పూర్తయ్యే ఏర్పాటు ఉంటుంది.

తాజా సమాచారం మేరకు… అల్లు కుటుంబం తదుపరి లక్ష్యం స్టూడియోలో మరిన్ని పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలను తీసుకురావడమేనని తెలిసింది. దాని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పరిశ్రమలోని ఇతర బడా నిర్మాతలు ఇక్కడకు వచ్చి చిత్రనిర్మాణానికి సంబంధించిన లాస్ట్ మినిట్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని వెళ్లేలా అల్లు కుటుంబీకులు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని కోరుకుంటున్నారు.

ఈ స్టూడియోకి అన్ని అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు మరింత భారీగా పెట్టుబడుల్ని సమకూర్చనున్నారు. రాబోయే రోజుల్లో ఇది దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్టూడియోలలో ఒకటిగా నిలపాలన్నది వారి ఆలోచన.

హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియోస్- అన్నపూర్ణ స్టూడియోస్- సారథి స్టూడియోస్ ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. కానీ చాలా స్టూడియోలు నామమాత్రంగానే వర్కింగ్ లో ఉన్నాయి. కొన్ని మూత పడ్డాయి. అదే క్రమంలో అల్లు స్టూడియోస్ నిర్మాణం ఉత్సుకతను పెంచింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!