జాతీయ రాజకీయాల్లో రాణించాలని గతంలో కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేశారు. కానీ, ఆ ప్రయత్నాలు ఫలిచలేదు. ఇప్పుడు చంద్రబాబు మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే, చంద్రబాబు మాదిరిగా ఒక విధివిధానం లేకుండా కేసీఆర్ ప్రయత్నించడం లేదు. దేశం పట్ల తన విజన్ ఏంటో చెబుతున్నారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే, కేసీఆర్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన దృష్టి సారించారు. సాటి తెలుగు రాష్ట్రంలో తన పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి చట్టప్రకారం కొన్ని నిబంధనలు ఉంటాయి. వీటిని అందుకుంటేనే జాతీయ పార్టీగా గుర్తింపు దక్కుతుంది. ఈ గుర్తింపు కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీకి రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే, ఏపీలో ఒంటరిగా పోటీ చేసే సాహసం కేసీఆర్ చేస్తారా అనేది ప్రశ్న.
ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కేసీఆర్ సిద్ధపడతారా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు కేసీఆర్, చంద్రబాబు హాజరుకాబోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు మాజీ మిత్రులు కలుసుకోనున్నారు. వీరి మధ్య రాజకీయ చర్చలు ఏమైనా జరిగే అవకాశం ఉందా అనే ఉత్కంఠ నెలకొంది. నిజానికి, టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు చాలా బలంగా కోరుకున్నారు.
2018లో నందమూరి హరికృష్ణ మరణించినప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందు ఈ ప్రతిపాదనను చంద్రబాబు పెట్టారట. హరికృష్ణ పార్ధివదేహం వద్దనే పొత్తు కోసం చంద్రబాబు అడిగారని కేటీఆర్ స్వయంగా ప్రకటించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, అప్పుడు చంద్రబాబుతో పొత్తుకు కేసీఆర్ ఇష్టపడలేదు. కుదరదని చెప్పేశారు. దీంతో గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిసి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని పొత్తుతో పోటీ చేయించారు. ఇది బెడిసికొట్టింది.
మరో ఏడాది లేదంటే ఏడాదిన్నరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబు మధ్య మళ్లీ పొత్తు చర్చలు జరుగుతాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయడం బీఆర్ఎస్‌కు కూడా లాభం చేకూర్చవచ్చు. అయితే, కేసీఆర్‌తో పొత్తు కోసం 2018లో వెంపర్లాడిన చంద్రబాబు ఇప్పుడు కూడా సిద్ధపడతారా అనేది చూడాల్సి ఉంది.
అయితే, ఇవాళ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముందో, తరవాతో కేసీఆర్, చంద్రబాబు కలిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోయినా జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న ఇద్దరు నాయకులు ఏం చర్చించుకుంటారో చూడాల్సి ఉంది. గత ఎన్నికల్లో పడిన దెబ్బ నుంచే చంద్రబాబు ఇంకా కోలుకోలేదు. కాబట్టి జాతీయ రాజకీయాల గురించి బాబు ఇప్పట్లో మళ్లీ ఆసక్తి చూపించరు. అయితే, అవకాశం దొరికితే తెలంగాణలో మాత్రం మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరిద్దరిని గెలిపించుకునేందుకు చంద్రబాబు కచ్చితంగా ప్రయత్నిస్తారు. మరి, బీఆర్ఎస్‌తో పొత్తుకు సిద్ధపడతారో లేదో చూడాలి.