గాడ్‌ఫాదర్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మధ్య ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల రాజకీయాల గురించి ఆయన చేసిన ట్వీట్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు, అలయ్ – బలయ్ కార్యక్రమంలో గరికపాటి చేసిన వ్యాఖ్యల వల్ల చిరంజీవి ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో నిర్ణయం కూడా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
సినీ పరిశ్రమలో ఒక వర్గం ఆధిపత్యాన్ని ఎదిరించి రాణించి మెగాస్టార్‌గా నిలిచిన ఘనత చిరంజీవిది. నటనలో ఆయన ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. అయితే, సినీ పరిశ్రమకు సంబంధించి మాత్రం చిరంజీవికి ఒక కోరిక అలాగే ఉండిపోయిందట. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా ఒక ఫిల్మ్ సిటీని నిర్మించాలనేది చిరంజీవి కల అని చెబుతారు. గతంలో ఆయన ఈ దిశగా ఆలోచనలు చేసినా కూడా తీరికలేని జీవితం కారణంగా కుదరలేదు.
అయితే, ఇప్పుడు మాత్రం ఆయన ఫిల్మ్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు గానూ ఆయన విశాఖపట్నం వైపు దృష్టి సారించారట. ఫిల్మ్ సిటీ నిర్మాణానికి విశాఖపట్నం నగరం సరైనదని చిరంజీవి భావిస్తున్నారు. నిజానికి, సినీ పరిశ్రమకు, షూటింగులకు విశాఖపట్నం అనువైన నగరమని అనేక ఏళ్లుగా చిత్రపరిశ్రమ భావిస్తోంది. కేవలం తెలుగు మాత్రమే కాదు వివిధ భాషల చిత్రాలు విశాఖపట్నంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతుంటాయి.
విశాఖపట్నం నగరాన్ని చిత్ర ప్రముఖులు బాగా ప్రేమిస్తారు. అయితే, హైదరాబాద్‌తో ఏర్పడిన అనుబంధం కారణంగా వారు విశాఖపట్నం రాలేకపోతున్నారు. మనస్సులో విశాఖపైన అభిమానం, ఇష్టం ఉన్నా హైదరాబాద్‌ను వదలలేకపోతున్నారు. ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకేసి విశాఖకు వెళితే కచ్చితంగా టాలీవుడ్ ముఖ్యులు చాలా మంది విశాఖకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినిమాల నిర్మాణం విశాఖ కేంద్రంగా జరుగుతుంది.
ఈ తొలి అడుగును మెగాస్టార్ చిరంజీవి వేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. విశాఖ అంటే చిరంజీవికి మొదటి నుంచి అభిమానం. చిత్ర పరిశ్రమకు విశాఖ అనువైన ప్రదేశమని ఆయన నమ్ముతారు. అందుకే, విశాఖను కూడా ఒక రాజధాని చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినప్పుడు మొదట స్వాగతించిన వ్యక్తుల్లో చిరంజీవి ఒకరు. అంతేకాదు, పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్‌ను చిరంజీవి కలిసినప్పుడు కూడా విశాఖలో చిత్ర పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రస్తావన వచ్చినట్లు చెబుతారు.
సినీ పరిశ్రమకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహాలను అందిస్తుందని చిరంజీవికి గతంలోనే జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏపీకి సినీ పరిశ్రమను తీసుకురావాలని ఆయన చిరంజీవి సహా సినీ ప్రముఖులను బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. ఇందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జగన్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఇచ్చిన పిలుపు మేరకు చిత్ర పరిశ్రమను విశాఖకు షిఫ్ట్ చేయాలనే ఆలోచన కొందరు సినీ పెద్దలు చేశారు.
కానీ, ఎవరో ఒకరు దీనికి ముందడుగు వేయాలి. వారి బాటలో మిగతా వారు పయనిస్తారు. ఇప్పుడు చిరంజీవి విశాఖకు సినీ పరిశ్రమను తెచ్చేందుకు బాటలు వేయనున్నట్లు సమాచారం. ఆయన ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించబోతున్నాని తెలుస్తోంది. విశాఖపట్నంలో తనవంతుగా ఒక ఫిల్మ్ సిటీని లేదంటే సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట ఉండేలా ఒక మెగా స్టూడియోను నిర్మించాలని భావిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ దిశగా ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందట.