Tuesday, April 22, 2025

హోంమంత్రికి చెక్ పెడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్సీ!

- Advertisement -

ఫైర్ బ్రాండ్.. ఈ మాట తరచూ రాజకీయాల్లో వినిపిస్తుంటుంది. పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించే నేతలను ఫైర్ బ్రాండ్ అంటారు. పార్టీ విధానాలపై గట్టిగా మాట్లాడే వారిని ఫైర్ బ్రాండ్ అంటారు. కానీ ఇటీవల ఈ మాట రూట్ తప్పింది. బూతులు చెప్పే వారిని కూడా ఫైర్ బ్రాండ్ అనే పరిస్థితికి వచ్చింది. ఈ మాటలను పక్కన పెడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్లుగా భావించిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కొందరు కేసుల్లో చిక్కుకున్నారు. మరికొందరు కేసులకు భయపడి మౌనం పాటిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బలమైన వాయిస్ వినిపిస్తున్నారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి.

మొన్నటి వరకు వరుదు కళ్యాణి ఒక సామాన్య ఎమ్మెల్సీ. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట సమయంలో ఉండగా శాసనమండలిలో ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కూటమిని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి మహిళా నేతలను ఎదుర్కోవడంలో వరుదు కళ్యాణి ముందు ఉంటున్నారు. అందుకే ఆమెను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు జగన్మోహన్ రెడ్డి.

గతంలో టిడిపి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండేవారు వంగలపూడి అనిత. పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో హోం మంత్రిగా ఆమెకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అది మొదలు ఆమె తన శాఖ ప్రగతి కంటే.. జగన్మోహన్ రెడ్డి పై విమర్శలకే ఎక్కువ పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు కౌంటర్ ఇస్తున్నారు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. జెట్ స్పీడ్ లో అనితకు దీటైన సమాధానం చెబుతూ ముందుకు సాగుతున్నారు. గత పది నెలల కూటమిపాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. కనీస స్థాయిలో కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని.. ఈ విషయంలో హోం మంత్రి అనిత విఫలమయ్యారని ఆరోపించారు కళ్యాణి. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే మంత్రిగా ఉన్న అనిత.. తన పనిని పక్కన పెట్టి.. రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని తిప్పి కొట్టారు వరుదు కళ్యాణి.

తాజాగా అనంతపురం జిల్లాలో పోలీసుల వ్యవహార శైలి వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఓ సామాన్య ఎస్సై రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసిన పరిస్థితికి వచ్చింది. దానిని సమర్థిస్తూ హోంమంత్రి అనిత మాట్లాడిన తీరును తప్పుపట్టారు వరుదు కళ్యాణి. అత్యంత ప్రజాదరణ కలిగిన ఓ నేత విషయంలో ఎస్సై తో పాటు హోంమంత్రి వ్యవహార శైలిని తీవ్రంగా ఆక్షేపించారు. చురకలు అంటించారు.

గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మహిళా నేతలు పని చేశారు. కానీ వరుద కళ్యాణి స్థాయిలో తిప్పి కొట్టలేకపోయారు. ఇప్పుడు శాసనమండలిలో వరుదు కళ్యాణి రూపంలో సరికొత్త అస్త్రం దొరికింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. అంది వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!