రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అతి పెద్ద డైలమాలో ఉన్నారు. తాను పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే స్వంత నియోజకవర్గమైన చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. ఇది ఆయన రాజకీయ జీవితానికి అతి పెద్ద లోటు. ఆ తర్వాత ఆయన కుప్పం నియోజకవర్గానికి మారారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఎన్నడూ రాలేదు. కుప్పంలో ప్రచారం చేయకపోయినా చంద్రబాబు భారీ మెజారిటీతో గెలిచేవారు.
2014 ఎన్నికల వరకు రాష్ట్రంలో టీడీపీ గెలిచినా, ఓడినా కుప్పంలో మాత్రం చంద్రబాబు మెజారిటీ పెరుగుతూ వచ్చింది. ఇలా కుప్పం నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్న చంద్రబాబుకు మొదటిసారి 2019లో భయాన్ని పరిచయం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2019లో వీచిన జగన్ వేవ్ చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించింది. కుప్పంలో ఒక దశలో ఆయన వెనకబడ్డారు. తర్వాత గెలిచారు. కానీ, మెజారిటీ భారీగా తగ్గిపోయింది.
అప్పుడు వైసీపీ అభ్యర్థిగా చంద్రమౌళి పోటీ చేశారు. ఎన్నికల నాటికి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రచారం కూడా చేయలేదు. అయినా కూడా చంద్రబాబు మెజారిటీ భారీగా తగ్గింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక కుప్పంపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. యువ నాయకుడు కేఆర్‌జే భరత్‌ను ఎమ్మెల్సీ చేసి కుప్పం బాధ్యతలు అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకంలో భరత్ కుప్పంలో పట్టు పెంచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా గత 40 ఏళ్లలో చంద్రబాబు కుప్పంలో చేయలేని అభివృద్ధిని మూడేళ్లలో చేసింది.
దీంతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు దూరమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది రుజువైంది. అయినా కూడా అసెంబ్లీకి మాత్రం తానే గెలుస్తానని చంద్రబాబు నమ్మకంగా ఉండే వారు. ఇటీవల జగన్ కుప్పం పర్యటనతో ఆయన నమ్మకం సడలిపోయింది. కుప్పంలో జగన్‌కు జనాలు నీరాజనం పలికారు. ఈ అనూహ్య స్పందన చూసిన తర్వాత కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం మొదలైంది. తానే స్వయంగా ఓడిపోతే రాజకీయ జీవితం చివరి దశలో అవమానకరంగా తప్పుకోవాల్సి వస్తుంది.
ఇది తెలిసే ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావించారు. తాను ప్రాణానికి ప్రాణంగా భావిస్తున్న అమరావతి ఉన్న గుంటూరు లేదా కృష్ణా జిల్లాలలోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని చంద్రబాబు భావించారట. కుప్పంలో ఓడినా ఇక్కడ గెలుస్తానని చంద్రబాబు నమ్మారట. అయితే, ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి.
ఒక అభ్యర్థి ఒకే స్థానంలో పోటీ చేయాలనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల్లోనే అమలులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే చంద్రబాబుకు భారీ షాక్ తగలడం ఖాయం. రెండు స్థానాల్లో నుంచి పోటీ చేయాలనే ఆయన ప్రయత్నాలు ఫలించవు. చివరకు కుప్పంలో తన గెలుపు కోసమే తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
రాష్ట్రమంతా పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయాల్సిన చంద్రబాబు కుప్పంలో ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుంది. ఇది ఆ పార్టీ విజయావకాశాల మీద దెబ్బ కొడుతుంది. రిస్క్ ఎందుకని భావించి కుప్పం వదిలి వేరే సేఫ్ సీట్ నుంచి పోటీ చేస్తే చంద్రబాబు భయపడ్డారనే ఒక భావన ప్రజల్లోకి వెళుతుంది. ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి ఎన్నికల్లో నష్టం చేయనుంది. కుప్పంలో పోటీ చేసి ఓడిపోతే ఆయన రాజకీయ జీవితానికి ఒకే చేదు మజిలీ అవుతుంది. మరి, చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.