2014లో హైదరాబాద్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. అన్నీ కూడా ఆ తరహాలోనే రాజకీయాలు చేస్తున్నారు. ప్రశ్నించడానికి పార్టీని పెట్టాను.. అని చెప్పే పవన్ కళ్యాణ్ తన పార్టీని ప్యాకేజీలకు ఇతర పార్టీలకు అమ్ముకుంటున్నారని ఆయన వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. 2014లో చంద్రబాబుకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అయితే ఆ సమయంలో పవన్ ఒంటరిగా పోటీ చేయడానికి కారణం టీడీపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా ఉండటానికి అని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది నెలలలో జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో మళ్ళీ పవన్ పొత్తు ప్రకటించడం జరిగింది. పూర్తి అవినీతి కేసులలో మునిగిపోయిన చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వత్తాసు పలకడం జనసేన పార్టీ నాయకులకు ఎంతో అసహనం కలిగిస్తోంది. కేవలం చంద్రబాబుకి రాజకీయంగా మేలు చేయడానికే..జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ పెట్టారని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన నాటి నుండి చంద్రబాబుకే మేలు చేసే విధంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీని అప్రతిష్టపాలు చేస్తూ ఉన్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతున్న క్రమంలో సొంతంగా ఏపీలో జనసేన ఎదిగే అవకాశం వచ్చిన పవన్ కళ్యాణ్ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా రాజకీయ అజ్ఞానిగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు జనసేనకి కేటాయించడం జరిగిందో చంద్రబాబు ఇంకా ఫైనలైజ్ చేయలేదు. మరోపక్క ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు కూడా సమయం లేకపోవడంతో జనసేన పార్టీని నమ్ముకుని ఉన్న చాలా మంది అభ్యర్థులు ఈ విషయంలో గందరగోళానికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్టితిలో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో సైకిల్ గుర్తుపైనే పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట. తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన గాజు గ్లాస్ గుర్తును పక్కన పెట్టేసి పూర్తిగా సైకిల్ గుర్తుపై.. ఎన్నికలను ఎదుర్కోవాలని తెలుగుదేశం పెద్దలతో పవన్ చర్చిస్తున్నారట. అయితే ఈ వార్తలపై జనసేన పార్టీని నమ్ముకున్న కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఇలా అయితే జనసేన పార్టీకి రాష్ట్రంలో అసలు ఉనికే ఉండదని ప్రశ్నార్థకంగా మారుతుందని పవన్ తీసుకున్న నిర్ణయాలపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇది మరో ప్రజారాజ్యం అని మరి కొంతమంది ఘటుగా కామెంట్లు చేస్తున్నారు. 2009 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలు రాకముందే ఓ రకంగా జనసేన పార్టీని తెలుగుదేశంలో కలిపేసినట్లే అని సైకిల్ గుర్తుతో జనసేన పోటీ పట్ల సొంత పార్టీ నేతల నుండి విమర్శలు వస్తున్నాయి.