నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు ఆ యువ నాయకుడు. ఇంకేముంది మంచి గుర్తింపు లభిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవి దక్కింది. ఏకంగా శాప్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. క్రీడారంగ అభివృద్ధికి కృషి చేయడం ఆ పదవి లక్ష్యం. కానీ ఆ యువ నేత ఆ పని చేయడం లేదు. చిన్న బాస్ లోకేష్ కు రహస్య ప్రతినిధిగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని చేరవేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో విభేదాలకు కారణం అవుతున్నారు. తమపై ఆ యువనేతను చిన్న బాస్ ప్రోత్సహించడమేంటని అధికార పార్టీ ఎమ్మెల్యేలు తెగ ఆందోళనతో ఉన్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన అనిమిని రవి నాయుడు ఏపీ శాప్ చైర్మన్ గా నియమితులయ్యారు. కూటమి విడుదల చేసిన మొదటి జాబితాలోనే పదవి దక్కించుకున్నారు. ఆయనకు లోకేష్ అండదండలు పుష్కలం. లోకేష్ మనిషిగా ముద్రపడ్డారు. అందుకే అత్యున్నత నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో రవి నాయుడు పాత్ర పెరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సైతం ఆయన పెత్తనం చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు, పులివర్తి నాని కదలికలను ఎప్పటికప్పుడు లోకేష్ కు చేరవేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారి అవినీతిని నిత్యం లోకేష్ కు నివేదికలో పంపడమే పనిగా పెట్టుకున్నాడు రవి నాయుడు. దీంతో ఆయనపై కూటమిలోని టిడిపి జనసేన నేతలు మండిపడుతున్నారు.
లోకేష్ అండదండలు చూసుకుని రవి నాయుడు చిత్తూరు జిల్లాలో రెచ్చిపోతున్నారట. ఆయన ఓ షాడో మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారట. తిరుపతి తో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి విషయం లోను వేలు పెడుతున్నారట. అతి జోక్యం చేసుకుంటున్నారట. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లోకేష్ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనకు సమీప బంధువు అని.. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి టికెట్ తనదేనని ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నాని షాక్ అవుతున్నారు. ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని నిలబెట్టుకుంటే.. రవి నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని నాని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో సైతం రవి నాయుడు జోక్యం పెరుగుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. లోకేష్ నీడగా చెప్పుకుంటూ టీటీడీ వ్యవహారాలపై తన ముద్ర చాటుకునేలా చేసుకుంటున్నారు అన్న విమర్శ కూడా ఉంది. దర్శన టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలని అంశంపై కూడా టీటీడీ ఉన్నతాధికారులకు రవి నాయుడు ఆదేశాలు ఇస్తున్నారట. చిత్తూరు జిల్లాలో రవి నాయుడును అలానే విడిచి పెడితే కూటమి పార్టీలో అసంతృప్తులు పెరుగుతారని టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు బంధువని చెప్పుకుంటూ తిరుగుతున్న రవి నాయుడు తీరుతో పార్టీకి నష్టం ఖాయమని టిడిపి సీనియర్లు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరి చంద్రబాబు, లోకేష్ లు రవి నాయుడును కట్టడి చేస్తారా? లేదా? అన్నది చూడాలి.