AP-Vijayawada:విజయవాడ నగరాన్ని చరిత్రలో ఎన్నడూ లేనంతగా భయపెట్టిన బుడమేరు వరద తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. అసలు ఎంత నష్టం జరిగింది అనే విషయం అంచనాలకు కూడా అందడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోజుకు పది లక్షలకు పైగా నిరాశ్రయులకు ఆహార పొట్లాలు, నిత్యావసరాలు అందిస్తోంది. నగరంలో ఎక్కడ చూసినా ఇంకా తగ్గని వరద. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం తగ్గుతోంది. కానీ బురద మాత్రం దారుణంగానే ఉంది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ స్థానిక ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తోంది. బుడమేరు గండ్లు పూడ్చి వేసే పనులలో అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది.
ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు హెచ్చరికలతో ఎక్కడైతే వరద తగ్గిందో అక్కడ గండ్లు పూడ్చి వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అంతా బాగానే ఉంది ఇక హమ్మయ్య అనుకునే సమయానికి బంగాళా ఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం విజయవాడ నగరంలో మళ్లీ ఎడతెరిపి లేని వానలు కురుస్తుండటంతో ప్రజలు ఏ క్షణాన ఏమవుతుందో అని ఆందోళన పడుతున్నారు. మంగళ, బుధవారాలలో ఎగువ ప్రాంతమైన ఖమ్మం, మైలవరం ప్రాంతాలలో కురిసిన వర్షాలతో మళ్లీ బుడమేరుకు నీటి ప్రవాహం పెరిగింది. బుడమేరుకు కొండపల్లి శాంతినగర్ వద్ద మూడు గండ్లు పడ్డాయి. దీనితో మరోసారి సింగ్ నగర్, రాయనపాడు, కవులూరు, తలప్రోలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే గత అర్థరాత్రి కురిసిన వర్షాల కారణంగా ఈ సారి పంట పొలాలనూ బుడమేరు ముంచెత్తింది.
ఇప్పటికీ తాడేపల్లి, వెలగలేరు, నున్న వంటి గ్రామాలన్నీ జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఇవే కాక కవులూరు, జక్కంపూడి కాలనీ, నైనవరం, పైడూరు పాడు లో పలు కాలనీలన్నీ పూర్తిగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. బుడమేరు వెడల్పు 180 మీటర్లు ఉంటే ఆక్రమణలతో సగానికి పైగా తగ్గిపోయింది. అందుకే తెలంగాణలో చెరువులు ఆక్రమించినవారిపై ప్రయోగించిన హైడ్రా ను ఆంధ్రాలో కూడా ప్రయోగించాలని కోరుతున్నారు. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా పరివాహక ప్రదేశాలలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే ఆ ప్రాంతాలలో రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. ఇప్పుడు మరోసారి బుడమేరుకు వరద వస్తే ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు ప్రజలు. ఏది ఏమైనా ఇది జరిగితే మాత్రం విజయవాడకి తప్పకుండా ఇదొక బ్యాడ్ న్యూస్ అవుతుంది.