Thursday, December 12, 2024

Telangana: తెలంగాణలో మరో ఎన్నిక రెడీ.. ఆశావహుల్లో సందడి

- Advertisement -

Telangana: తెలంగాణలో మరో సమరానికి తెరలేచింది. నాలుగు ఉమ్మడి జిల్లాలు, 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. కొద్దిరోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీంతో ఆశావహులు పావులు కదపడం ప్రారంభించారు. రాజకీయ పార్టీలు సైతం సన్నాహాలు మొదలుపెట్టాయి. తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ విద్యావంతుల మద్దతు కోరుతున్నారు. ఓ వైపు పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తూనే..మరోవైపు పార్టీ టిక్కెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సారి తటస్థులు కూడా పోటీకి సిద్ధం అవుతుండటం ఆసక్తి రేపుతోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు రంగంలోకి దిగుతుండటంతో..పొలిటికల్ పార్టీలు వర్సెస్ తటస్థులు మధ్య పోటీ నెలకొననుంది. ఇంతకాలం రాజకీయాలతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన వారు కూడా పోటీ పడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు జరిగి పది నెలలవుతోంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి నాలుగు నెలలు పూర్తయ్యాయి. ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నిక రావడంతో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌తో పాటుగా ఇతర పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ తిరిగి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుండగా.. బీజేపీ కాషాయం జెండా ఎగుర వేయాలని ప్లాన్ చేస్తుంది. ఇక గతంలో బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న ఈ మండలి సెగ్మెంట్లో తిరిగి సత్తా చాచేందుకు కారు పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇదే సమయంలో తటస్థులు తమ గెలుపుతో రికార్డులు బద్దలు కొట్టాలనుకుంటున్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ విజయం సాధించగా.. 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీవన్ రెడ్డి గెలుపొందారు. అయితే ఈసారి విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది.కాంగ్రెస్ పార్టీ టికెట్‌కు పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేందర్ రావు, మేనేని రోహిత్ రావు, ప్రణవ్ బాబు, ఆర్.సత్యనారాయణ, ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే నరేందర్ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినా రాకున్నా పోటీ చేస్తానంటున్నారు. మిగితా వారంతా ఎవరికి వారు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి.. మరోసారి మండలికి పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.జీవన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయన కోరితే టిక్కెట్ లభించే అవకాశముంది.

బీఆర్ఎస్ నుంచి ట్రస్మా ఛీఫ్ అడ్వయిజర్ యాదగిరి శేఖర్ రావు టికెట్ వస్తుందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. ఆ పార్టీకి చెందిన మాజీ మేయర్ రవీందర్‌ సింగ్ కూడా పోటీలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, రాణి రుద్రమ, జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, మంచిర్యాల జిల్లా అద్యక్షుడు రఘునాథ్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఆశావాహులంతా ఇప్పటికే అధిష్టానాలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన డాక్ట్రర్ బీఎన్ రావు పోటీకి రెడీ అయ్యారు. విద్యాసంస్థల నిర్వాహకుడు, జాబ్ మేళాలతో యవతకు ఉపాధి కల్పిస్తున్నా ముస్తాక్ అలీ పోటీకి సైఅంటున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారే కాకుండా…ఇతర జిల్లాల్లో చాలామంది మండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏ పార్టీ నుంచి అయినా ఒక్కరికే టికెట్ వస్తుంది కాబట్టి టికెట్ రాని వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అనేది వేచి చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!