Jagan: అధికారంలో ఉన్నామా లేమా అన్నది ముఖ్యం కాదు.. ప్రజల గుండెల్లో నిజంగా ఎంత స్థానం సంపాదించామనేది అవసరం. కొన్ని అవకతవకలు, కూటమి కుట్ర రాజకీయాలు, హడావిడి మధ్య గత ఎన్నికల్లో వైసీపీ అధికార పీఠాన్ని దక్కించుకోలేక పోయింది కానీ, ప్రజల మనసుల్లో ఉన్న స్థానాన్ని మాత్రం మరింత పదిలపరుచుకుంది. అదే వైసీపీపై, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న క్రేజ్ మరోసారి తాజా ఘటన ద్వారా నిరూపితమైంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకుని అందరూ వైసీపీ పని అయిపోయిందని ఎద్దేవా చేస్తున్నారే గానీ, అందుకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలను గుర్తించలేని స్థితిలో ఉన్నారు టీడీపీ నేతలు. వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను నిన్న జైలుకి వెళ్లి వైఎస్ జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
గుంటూరు సబ్ జైలు వద్ద విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ అయేషా బాను జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంది. జగన్ వచ్చిన సమయంలో ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించింది. తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చిన ఆ కానిస్టేబుల్ ఫోటో దిగేందుకు అనుమతి కోరి అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళా కానిస్టేబుల్ అయేషా బాను అనంతపురం జిల్లాకు చెందివారని తెలిసింది. జగన్‌తో మహిళా కానిస్టేబుల్ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె చూపిన అంతులేని అభిమానానికి జగన్ ఉప్పొంగిపోయి కాసేపు మాట్లాడారు. జగన్ మీద ప్రజల్లో తరగని అభిమానానికి ఇది ఒక నిదర్శనం అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.