Chandrababu: పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో చంద్రబాబు పీఎస్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన పెండ్యాలకు టీడీపీ ప్రభుత్వం తోడుగా నిలిచింది. దీంతో ఆయనపై ఉన్న విచారణను సైతం పక్కదోవ పట్టించి తిరిగి సర్వీసులో చేర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. పెండ్యాల సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. శ్రీనివాసరావు విధులకు గైర్హాజరయ్యారని, అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని నమోదైన అభియోగాలు పాక్షికంగా మాత్రమే రుజువైనట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం ఒక్కటే ఆయన చేసిన తప్పు అని నిరూపిస్తూ ప్రభుత్వం తూతూమంత్రంగా కేసును ముగించింది. కాగా, వైసీపీ హయాంలో ఏకంగా 4 సార్లు పెండ్యాల సీఐడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
రూ.371 కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో నిందితుడిగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అతని ప్రధాన కార్యదర్శి అయిన పెండ్యాల పేరు బాగా వినబడింది. ఐటీ సోదాల్లో భాగంగా పెండ్యాలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. శ్రీనివాసరావుపై ఉన్న అభియోగాలు కూడా నిరూపితం కావడంతో వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో 2023, సెప్టెంబర్ 29న గత వైసీపీ ప్రభుత్వం పెండ్యాలను సస్పెండ్ చేసింది. స్కిల్ డెవలప్‌మెంటు కేసులో సంబంధిత విభాగం నుంచి అక్రమంగా నిధులు దారి మళ్లించారన్నది వైసీపీ పెట్టిన కేసు. ఈ కేసులోనే చంద్రబాబును జైల్లోనే పెట్టారు. ఈ క్రమంలోనే సీఐడీ పెండ్యాలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం కావడంతో అమెరికా పారిపోయారు.
గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే తనకు అనుకూల పరిస్థితులను సృష్టించుకుంది. ఈ క్రమంలోనే పెండ్యాలపై వైసీపీ పెట్టిన కేసులను రద్దు చేయడంతో పాటు సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అయితే ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తుంటే.. సామాన్య ప్రజలలో టీడీపీ ప్రభుత్వంపై అనుమానం రాక తప్పదు. గతంలో అవినీతికి పాల్పడి భారీ కుంభకోణంలో నిందితుడిగా ప్రూవ్ అయిన పెండ్యాల.. ఇప్పుడు నిర్దోషిగా ఎలా మారుతాడు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఉండడమే ఈ సస్పెన్షన్ ఎత్తివేతకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. అధికారం మారేసరికి అవినీతిపరుడు ఇప్పుడు మంచివాడిలా ఎలా నిరూపించబడతాడని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. ఇదంతా చూస్తుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలనే ఈ అసాంఘిక చర్యలకు పాల్పడిందని, అబద్దం ఎన్ని ఏళ్లు దాక్కున్నా నిజంలా మారలేదని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.