Chandrababu-pawan kalyan:విజయవాడ వరద భీభత్సాన్ని అరికట్టకుండా విఫలమైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ వైఫల్యాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఎలాగైనా ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత తీసుకు రావడమే లక్ష్యంగా పెట్టుకుంది. జగన్ మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకుంది ఎల్లో మీడియా కూడా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే ఈ వరదలు వచ్చాయని ప్రజలని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆగష్టు 28వ తేదీన వాతావరణ శాఖ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలెర్ట్ ని కూడా ప్రకటించింది. అతి భారీ వర్షాలు కురుస్తాయని వాగులు జలాశయాలు నిండే అవకాశం ఉందని చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలని ఎందుకు అప్రమత్తం చేసి వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించలేదు? వాతావరణ శాఖ ముందుగానే ఇచ్చిన రెడ్ అలెర్ట్ ని ప్రభుత్వం ఎందుకు బేఖాతరు చేసింది? ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా?
ఇప్పటి వరకు ప్రభుత్వ వైఫల్యం ద్వారా వచ్చిన వరదల కారణంగా పన్నెండు మంది చనిపోయారు. దీనికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడే కదా. ప్రతి క్రైసిస్ ని ఒక అవకాశంగా మార్చుకొని ఆయన ఇమేజ్ ని పెంచుకోవడానికి లేదా ఆయన ప్రభుత్వం చాలా అద్భుతంగా పాలన అందిస్తోంది అని ప్రచారం చేసుకోవడానికే వాడుకుంటారు చంద్రబాబు నాయుడు. యంత్రాంగాన్ని పరుగులు తీయించాల్సిన వ్యక్తి దాన్ని పక్కన పెట్టి ప్రచార యావ కోసం పాకులాడుతూ బోటులో షికార్లు చేస్తూ ప్రజలకి అభివాదం చేస్తూ ఉండటం ఎంత వరకు న్యాయం? అమరావతి పరిస్థితి ఎలా ఉందో కనీసం ప్రజలకి ఎందుకు తెలియజేయలేదు? ఎందుకు అక్కడి విజువల్స్ చూపించడానికి మీడియాని కానీ డ్రోన్లని కానీ అనుమతించలేదు ఈ ప్రభుత్వం? మరొక పక్క పవన్ కళ్యాణ్ తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే అధికారులకు మరియు ప్రజలకి ఇబ్బంది అని ఇంట్లో కూర్చొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తుంటే లేని సెక్యూరిటీ ఇబ్బందులు పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఎందుకు ఉంటాయి?
ఒక పక్క అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ చేయగలిగినప్పటికీ విజయవాడ కలెక్టరేట్ లో ఉంటూ చంద్రబాబు నాయుడు అదే పనిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రోజంతా పర్యటిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం బ్యాక్ గ్రౌండ్లో ఏదో పని చేసుకుంటూ ఉండటం ఏంటి? చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఏదైనా కొత్త నాటకం మొదలు పెట్టారా మళ్ళీ అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి. ఈ కొత్త నాటకానికి సంబంధించి ఆధారాలని జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ప్రజల ముందు బయట పెట్టనున్నారని వీరి అసలు స్వరూపం ప్రజలకి తెలియజేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.