Wednesday, February 12, 2025

టిడిపిలో పెరుగుతున్న లోకేష్ డిప్యూటీ సీఎం స్లోగన్.. తెర వెనుక చంద్రబాబు!

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు తెలియకుండా చిన్న పని కూడా జరగదు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా.. పార్టీలో జరిగే ప్రతి పని చంద్రబాబుకు తెలిసే జరుగుతుంది. నిరంతరం పార్టీ పై నిఘా ఉండేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక స్లోగన్ బలంగా వినిపిస్తోంది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దాదాపు ప్రతి జిల్లా నుంచి ఇదే రకమైన అభిప్రాయం వస్తోంది. అయితే ఇదంతా భారీ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ప్రధానంగా పార్టీలు లోకేష్ మనుషులు తొలుత ఈ డిమాండ్ చేయగా.. ఇప్పుడు పార్టీ మొత్తం ఈ స్లోగన్ విస్తరిస్తోంది. చివరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం టిడిపి నేత వర్మ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పడం సంచలనంగా మారుతోంది.

మహాసేన రాజేష్ ఈ తేనె తుట్టను కదిపారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యే అర్హత మంత్రి లోకేష్ కు ఉందని తేల్చి చెప్పారు. అయితే ఆయన లోకేష్ పై అభిమానం కంటే.. పవన్ పై ఉన్న కోపంతోనే ఈ కామెంట్స్ చేశారని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. లైట్ తీసుకున్నారు కూడా. తరువాత బుద్ధ వెంకన్న నుంచి ఇదే తరహా కామెంట్స్ రావడం చర్చకు దారి తీసింది. ఒక పద్ధతి ప్రకారం పార్టీలో లోకేష్ కు ప్రమోట్ చేస్తున్నారని అర్థమయింది. ఇక అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఎదుటే సీనియర్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఇదే విజ్ఞప్తి చేశారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబును కోరారు. అటు తరువాత పిఠాపురంలో ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడంతో.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు మాత్రం పెరుగుతున్నాయి.

టిడిపి హై కమాండ్ నుంచి ఆదేశాలు వెళ్ళనిదే ఇలా నేతలు మాట్లాడరని తెలుస్తోంది. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సీఎం గారు చంద్రబాబు, ఏకైక డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. లోకేష్ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ ను సైతం డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి పెరుగుతోంది. అయితే ఇది వ్యూహాత్మకంగా జరుగుతోందా? లేకుంటే పవన్ కళ్యాణ్ తో సమానంగా లోకేష్ కు చూడాలనుకుంటున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ డిమాండ్ ఎంపిక చేసిన నేతల నోటి నుంచి మాత్రమే వినిపిస్తోందన్న టాక్ ఉంది. ముఖ్యంగా జనసేన విషయంలో అభ్యంతరాలు ఉన్న నేతలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే జనసేన ను ఇరుకున పెట్టేందుకేనా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

అయితే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని పవన్తో చంద్రబాబు తప్పకుండా ఆలోచన చేసి ఉంటారని కూడా ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఈ తరుణంలోనే లోకేష్ ను పవన్తో పాటు డిప్యూటీ సీఎం గా చూడాలని చంద్రబాబు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ అనుమతించిన తరువాత.. చంద్రబాబు ఆదేశాలతోనే టిడిపి నేతలు ఈ సరికొత్త డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ కూటమిలో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. అయితే అది వ్యూహాత్మకంగా చేస్తోందా? లేకుంటే యాదృచ్ఛికంగా జరుగుతోందా? అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!