చోడవరం… కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అంతేకాదు షుగర్ టౌన్ గా కూడా పేరుగాంచింది. టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ హవా నడిచింది. కానీ రాజశేఖర్ రెడ్డి ఎంట్రీ తో సీన్ మారింది. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీకి చిక్కింది చోడవరం. కానీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ ఓడిపోయారు. దీంతో జగన్ వ్యూహం మార్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రమోట్ చేశారు. దీంతో చోడవరం పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు అయింది.
2019 ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో బంపర్ విక్టరీ సాధించారు కరణం ధర్మశ్రీ. ఏకంగా 54% ఓటు షేర్ తో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ఎన్నికల్లో వచ్చేసరికి సీన్ మారిపోయింది. భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దీంతో ఇక్కడ వ్యూహం మార్చారు జగన్. ఇక్కడ ఎమ్మెల్యేగా కేఎస్ఎన్ రాజు విజయం సాధించారు. ఆయనకు తట్టుకుని నిలబడాలంటే ధర్మశ్రీ తో పాటు గుడివాడ అమర్నాథ్ ఉండాలని భావించారు. కరణం ధర్మశ్రీ బలమైన నాయకుడు అయిన ఆయనపై నెగిటివ్ పబ్లిసిటీ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండరన్న పేరు ఉంది. కుటుంబ సభ్యులపై అనేక రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ అన్ని ఆలోచించి గుడివాడ అమర్నాథ్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్కు సొంత నియోజకవర్గం అంటూ లేదు. 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అమర్నాథ్. కానీ 2014 నుంచి 2019 మధ్య అనకాపల్లి అసెంబ్లీ స్థానంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో 2019 ఎన్నికల్లో గెలిచారు గుడివాడ అమర్నాథ్. కానీ ఈ ఎన్నికలకు ముందు అనకాపల్లి నుంచి తప్పించారు. చివరి నిమిషంలో గుడివాడ అమర్నాథ్కు గాజువాక అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. దీంతో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తనకు గాజువాక నియోజకవర్గం అంత సేఫ్ కాదని భావించారు అమర్నాథ్. అవంతి శ్రీనివాసరావు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో భీమిలి ఇన్చార్జి స్థానం కోసం ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం గుడివాడ అమర్నాథ్ కు చోడవరం బాధ్యతలు కట్టబెట్టారు. అయితే వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని చోడవరం విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరణం ధర్మశ్రీని అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించి.. గుడివాడ అమర్నాథ్ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా చేయాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.