Thursday, December 12, 2024

R. Krishnaiah: పొలిటికల్ జంక్షన్ లో ఆర్.క్రిష్ణయ్య..బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ

- Advertisement -

R. Krishnaiah: తెలుగు రాజకీయాల్లో ఆర్.క్రిష్ణయ్యది సెపరేట్ రూట్. తెలంగాణ నేతలు ఏపీలో.. ఏపీ నేతలు తెలంగాణాలో రాజకీయాలు చేయలేని రోజులివి. అటువంటిది క్రిష్ణయ్య మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు పిలిచి మరీ పెద్దపీట వేస్తున్నాయి. పదవులు ఇస్తున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీలోనూ శాశ్వతంగా ఉండరు క్రిష్ణయ్య. టీడీపీ అయితే ఏకంగా తెలంగాణ బీసీ ముఖ్యమంత్రిగా క్రిష్ణయ్యను తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది. జగన్ బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పేందుకు ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చారు. తాజాగా క్రిష్ణయ్య మావాడంటే మావాడని చెప్పుకునేందుకు అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి.

వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య ఇప్పుడు పొలిటికల్‌ చౌరస్తాలో నిల్చొన్నారు. దశాబ్దాలుగా బీసీల కోసం ఉద్యమించిన తాను.. మళ్లీ బీసీల హక్కుల కోసం పోరాడతానని ప్రకటించారు. కానీ, ఆయన ప్రకటనలపై ఎన్నో సందేహాలు.. మరెన్నో అనుమానాలు.. బీసీ పోరాటల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణయ్యను తెలంగాణ రాజకీయాల్లో వాడుకోవాలని రెండు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయట… కేంద్రంలో పదవి ఇస్తామని ఓ పార్టీ.. రాష్ట్రంలో చూసుకుంటామని మరో పార్టీ ఆయన వెంట పడుతున్నాయని చెబుతున్నారు.. ఇంతకీ బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య ఆలోచనలేంటి? ఆయన పొలిటికల్‌ ప్లానింగ్‌ ఎలా ఉండబోతోంది. అన్నది హాట్ టాపిక్ అవుతోంది.

బీసీ ఉద్యమనేత ఆర్‌.కృష్ణయ్య పొలిటికల్‌ ఫ్యూచర్‌పై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. బీసీ ఉద్యమం అంటేనే గుర్తుకొచ్చే ఆర్‌.కృష్ణయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. తెలంగాణల్లో ప్రభావవంతమైన బీసీ నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఆర్‌.కృష్ణయ్య కోసం ఎప్పుడూ డోర్స్‌ ఓపెన్‌ చేసి ఉంచుతున్నాయి.

ఇప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌.. ఆర్‌.కృష్ణయ్యను తమ పార్టీలో చేరమంటే తమ పార్టీలో చేరమని ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. నిన్నటివరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్‌.కృష్ణయ్య అకస్మాత్తుగా తన ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. బీసీ ఉద్యమ నేతగా తెలంగాణలో ఆయనకు గణనీయమైన అనుచరగణం ఉండటంతో ప్రధాన పార్టీలు రెండూ కృష్ణయ్య కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

90వ దశకం నుంచి బీసీ ఉద్యమ నేతగా తెలంగాణలో తన ముద్ర వేసిన కృష్ణయ్య… 2014లో తొలిసారిగా ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ-టీడీపీ పొత్తుతో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌.కృష్ణయ్య ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత టీడీపీ శాసనసభ్యుల్లో ఎక్కువ మంది అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరినా, కృష్ణయ్య మాత్రం సింగిల్‌గానే ఉండిపోయారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిన కృష్ణయ్య, రెండేళ్ల క్రితం ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభలో అడుగు పెట్టారు.

ఐతే తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బీజేపీ.. ఎప్పటి నుంచో ఆర్‌.కృష్ణయ్యపై గురిపెట్టినట్లు చెబుతున్నారు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కృష్ణయ్యతోనూ రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని కమలనాథులు స్కెచ్‌ వేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తమ పార్టీలోకి వస్తే జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అకస్మాత్తుగా రాజ్యసభకు రాజీనామా చేసిన కృష్ణయ్య మళ్లీ బీసీ ఉద్యమంలో పనిచేస్తానని ప్రకటించినా, ఆయనతో కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడం, సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నాగర్‌ కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, బీసీ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌ వంటి వారు కృష్ణయ్యను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు చేయడం ఆసక్తి పెంచేస్తోంది. తాను బీసీ ఉద్యమానికే పరిమితమవుతానని కృష్ణయ్య చెబుతున్నా… రెండు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానాలు ఉండటంతో ఎటూ తేల్చుకోలేక ఆయన అలాంటి ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ఒక వైపు కేంద్రం, రెండో వైపు రాష్ట్రం నుంచి పదవులు ఇస్తామని చెబుతుండటంతో ఏ పదవి అయితే బాగుంటుందని ఆయన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లలో మూడు పార్టీలు మారిన ఆర్‌.కృష్ణయ్య ఈ సారి ఏ పార్టీలోకి వెళతారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బలపడాలని భావిస్తున్న కమలనాథులు… జాతీయ స్థాయిలో ఎలివేషన్‌ ఇస్తామని చెబుతుండటంతో ఆయన అడుగులు అటువైపు వేస్తారా? లేక లోకల్‌ ఫీలింగ్‌తో కాంగ్రెస్‌ను ఎంచుకుంటారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి పొలిటికల్‌ చౌరస్తాలో నిలబడిన బీసీ ఉద్యమనేత ఎంపీ పదవిని వదులుకోవడం ఒక ఎత్తైతే… ఇప్పుడు కొత్తగా చేరే పార్టీని ఎంచుకోవడం మరో ఎత్తుగా చెబుతున్నారు. ఏదిఏమైనా కొద్దిరోజుల్లోనే ఈ సస్పెన్స్‌కు తెరపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!