క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మెగా ఫైట్ కోసం చిరకాల ప్రత్యర్థులు సిద్ధమయ్యాయి. గత ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌సేన సై అంటుంటే… మరోసారి టీమిండియాను నిలువరించేందుకు పాక్ రెడీ అయింది. టోర్నీకే హైలెట్‌గా భావిస్తున్న ఈ మ్యాచ్‌కు ఐకాన్ స్టేడియం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదిక కాబోతోంది. భారత్, పాకిస్థాన్ ఎప్పుడు తలపడినా ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీ నుంచి సామాన్య అభిమాని వరకూ కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోతారు. మ్యాచ్ గెలిస్తే సంతోషం.. లేకుంటే ఆగ్రహం..వెరసి భావోద్వేగాలతో ముడిపడే ఈ పోరు ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తుందనడంలో డౌట్ లేదు. ఈ సారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా వరల్డ్ కప్ వేటను ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది. భారత జట్టు బలమంతా ప్రస్తుతం బ్యాటింగ్‌లోనే ఉంది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, రాహుల్‌పై అంచనాలున్నాయి. భారీస్కోర్ చేయాలన్నా.. టార్గెట్‌ను టెన్షన్ లేకుండా ఛేదించాలన్నా వీరిచ్చే ఆరంభమే కీలకం. తర్వాత కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్ వేస్తే తిరుగులేనట్టే.. చాలా రోజుల తర్వాత కోహ్లీ ఫామ్‌లోకి రావడం అడ్వాంటేజ్. అదే సమయంలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతుండడం పాక్ బౌలర్లకు కంగారు పుట్టిస్తోంది.
ఇదిలా ఉంటే ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా, ఫినిషర్ దినేశ్ కార్తీక్ ఎలాంటి ప్లేయర్లో ప్రత్యేకంగా చెప్పాలా.. అయితే ఒత్తిడి ప్రధానంగా ఉండే పాక్‌తో మ్యాచ్‌లో వీరు ఎలా ఆడతారనేదే ఆసక్తికరం. మరోవైపు భారత్‌కు ఈ సారి బౌలింగ్ కాస్త టెన్షన్ పెడుతోంది. స్టార్ పేసర్ బూమ్రా దూరమవడం పెద్ద ఎదురుదెబ్బ. అయితే అతని స్థానంలో వచ్చిన షమీ వార్మప్ మ్యాచ్‌లో సత్తా చాటడం కలిసొచ్చే అంశం. మిగిలిన పేస్ ఎటాక్‌లో అర్షదీప్‌సింగ్, హర్షల్ పటేల్‌పై అంచనాలున్నాయి. ఇక స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌తో పాటు చాహల్, అశ్విన్‌లలో ఒకరికి చోటు దక్కనుంది.
ఇక పాకిస్థాన్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ జట్టుకు బ్యాటింగ్‌లో బాబర్ అజామ్, రిజ్వాన్‌లే కీలకం. మిగిలిన బ్యాటర్లలో నిలకడ లేకపోవడం మైనస్ పాయింట్. అటు బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదితో మన బ్యాటర్లకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. గత వరల్డ్‌కప్‌లో షాహీన్ కారణంగానే ఓటమి ఎదురైంది. అలాగే మిగిలిన పేసర్లు కూడా రాణిస్తుండడం పాక్‌కు అడ్వాంటేజ్. గత రికార్డుల పరంగా మాత్రం భారత్‌దే పై చేయి. ఇప్పటి వరకూ టీ ట్వంటీ వరల్డ్‌కప్ చరిత్రలో ఇరు జట్లూ ఆరు సార్లు తలపడితే.. టీమిండియా 5-1తో తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. కాగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న మెల్‌బోర్న్ పిచ్ బ్యాటర్లు, బౌలర్లకు బ్యాలెన్సింగ్‌గా ఉంటుందని అంచనా. ఆరంభ ఓవర్లలో పేసర్లకు సహకరిస్తుందని తెలుస్తోంది.