గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేందుకు మంచి అవకాశాలు అప్పుడు కనిపించాయి. కానీ, చివరకు నాలుగు స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అయితే, అప్పటికి టీడీపీ సిట్టింగ్ స్థానంగా ఉన్న దర్శి నియోజకవర్గాన్ని మాత్రం వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. వైసీపీ నుంచి పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ 40 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
గత ఎన్నికల్లో ఇంతలా మెజారిటీ దక్కిన దర్శి నియోజకవర్గంలో ఈసారి మాత్రం వైసీపీకి పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. దర్శి నియోజకవర్గంలో వైసీపీని ప్రతిపక్షాలు దెబ్బ తీయడం లేదు. అసలు ఇక్కడ టీడీపీకి సరైన అభ్యర్థి కూడా లేరు. మిగతా పార్టీల గురించి చెప్పుకోవడం కూడా దండగ. అయినా కూడా వైసీపీ ఇక్కడ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇందుకు కారణం పార్టీలోని గ్రూపు తగాదాలే. ముగ్గురు కీలక నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్లనే దర్శి నియోజకవర్గంలో వైసీపీ దెబ్బతింటోంది.
ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధించినా అనూహ్యం దర్శిలో మాత్రం నగర పంచాయతీని కోల్పోయింది. ఇందుకు కారణం కూడా వైసీపీ కీలక నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే. నిజానికి గత రెండు దశాబ్దాలుగా దర్శి నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం వెంట దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి కుటుంబం నడుస్తోంది. వైఎస్‌కు సన్నిహితుడిగా సుబ్బారెడ్డి ఉండేవారు. ఆ తర్వాత జగన్ వెంట సుబ్బారెడ్డి కుమారుడు శివప్రసాద్ రెడ్డి నడుస్తున్నారు.
అయితే, 2019 ఎన్నికల్లో వ్యక్తిగత సమస్యల వల్ల శివప్రసాద్ రెడ్డి పోటీ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో మద్దిశెట్టి వేణుగోపాల్‌కు జగన్ టిక్కెట్ ఇచ్చారు. అంతకుముందు 2009లో మద్దిశెట్టి పీఆర్పీ తరపున పోటీ చేసి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల్లో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకపోయినా మద్దిశెట్టి వేణుగోపాల్ విజయం కోసం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాగానే సహకరించారు. దీంతో మద్దిశెట్టికి భారీ మెజారిటీ దక్కింది.
అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలు, ఆధిపత్య పోరు మొదలైంది. మరోవైపు 2014లో టీడీపీ తరపున గెలిచి మంత్రి అయిన శిద్ధా రాఘవరావు కూడా ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు. దీంతో దర్శి నియోజకవర్గంలో వైసీపీకి ముగ్గురు కీలక నేతలు ఉన్నారు. ముగ్గురికీ వేర్వేరు వర్గాలు ఉన్నాయి. దీంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి నష్టం చేసింది. అయినా కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది మరింత తీవ్రం అవుతోంది. ముగ్గురు నేతలూ వచ్చే ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ నాయకుడికే ఈసారి టిక్కెట్ వస్తుందని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, ఈసారి టిక్కెట్ కోసం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్రంగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కనుక టిక్కెట్ అడిగితే జగన్ కాదనలేరని అంటున్నారు.
వైఎస్ కుటుంబానికి, బూచేపల్లి కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. పైగా బూచేపల్లి కుటుంబం దర్శిలో బలమైనది. కేవలం దర్శి మాత్రమే కాదు రెండు మూడు నియోజకవర్గాల్లో బూచేపల్లి కుటుంబం పార్టీకి బలం. కాబట్టి, కచ్చితంగా శివప్రసాద్ రెడ్డికే టిక్కెట్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల జిల్లా ప్లీనరీలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీపైన, ప్రభుత్వంపైన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మద్దిశెట్టికి మళ్లీ టిక్కెట్ ఇస్తే బూచేపల్లి సహకరించడం కష్టమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. బూచేపల్లి సహకారం లేకపోతే ఇక్కడ వైసీపీ గెలుపు అంత సులువు కాదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్‌కు షాక్ తప్పేలా లేదు.