2014 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావో రేవో అన్నట్లుగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గనుక గెలవకపోతే ఇక ఆ పార్టీ ఎప్పటికీ గెలిచే పరిస్థితి ఉండదు. తర్వాతి ఎన్నికల నాటిని చంద్రబాబు యాక్టీవ్ పాలిటిక్స్‌లో ఉండేందుకు ఆయన వయస్సు సహకరించదు. చంద్రబాబు తప్పుకుంటే టీడీపీనీ నడిపించే నాయకుడు లేడు. నారా లోకేష్ సామర్థ్యంలో అందరికీ తెలిసిందే. ఇవన్నీ తెలుసు కాబట్టే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చి నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడంతో పాటు టీడీపీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు కలలు కంటున్నారు.
కలలు కనడమే కాదు కలను నిజం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇతర పార్టీలు, ఇతర వ్యవస్థల్లోని తన మనుషులు, మీడియాను ఉపయోగించుకొని ఎలాగైనా 2024 ఎన్నికల్లో గెలవాలని పట్టుదలగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు. మరోవైపు టీడీపీ క్యాడర్‌లో నైరాశ్యం దూరం చేయడానికి కూడా చంద్రబాబు బాగానే ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇక గెలిచేసినట్లే అనే భావన వారిలో కల్పిస్తున్నారు. ఇందుకు గానూ యెల్లో మీడియాను, ఫేక్ సర్వేలను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు.
వైసీపీ పని ఇక అయిపోయినట్లేనని, రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అని బయటకు ఎంత గట్టిగా చెబుతున్నా కూడా చంద్రబాబును ఒక విషయం మాత్రం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. కనీసం 40 స్థానాల్లో అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే లేరనే చేదు నిజం గుర్తుకు వస్తే చాలు చంద్రబాబుకు ముచ్చెమటలు పడతాయి. టీడీపీ గెలిచేస్తోంది.. వైసీపీ ఓడిపోతోంది.. అని చంద్రబాబు, యెల్లో మీడియా చెప్పే కబుర్లు అమాయక టీడీపీ అభిమానులు, చంద్రబాబును, యెల్లో మీడియాను గుడ్డిగా నమ్మే వారు, ఇతర రాష్ట్రాల్లోనో, ఇతర దేశాల్లోనే స్థిరపడిన వారు నమ్మవచ్చు.
కానీ, వాస్తవ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులు అవగాహన ఉన్న వారు మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుందనే మాటను నమ్మలేకపోతున్నారు. టీడీపీ నేతలు సైతం ఈ మాటను నమ్మడం లేదు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో 40 స్థానాల్లో వైసీపీకి ధీటైన పోటీ ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కూడా లేరు. 40 ఏళ్ల పార్టీకి అభ్యర్థులు దొరకడం కష్టమేమీ కాదు. కానీ, బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొనే స్థాయిలో మాత్రం అభ్యర్థులు లేరు.
ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో ఆరు స్థానాల్లో టీడీపీకి అభ్యర్థులే లేరు. కర్నూలు జిల్లాలో ఐదు స్థానాల్లో సరైన అభ్యర్థులు కనిపించడం లేదు. చిత్తూరులోనూ ఐదు స్థానాల్లో ఇదే పరిస్థితి. రాయలసీమలో కాస్తో కూస్తో ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రమే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు కనిపిస్తున్నారు. ఇక్కడా ధర్మవరం లాంటి నియోజకవర్గాల్లో ఎవరు నిలబడతారో కచ్చితంగా చెప్పలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది.
ఇక, వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నెల్లూరు టీడీపీలో కాకలుతీరిన కమెడియన్ల లాంటి నేతలు, ఓటముల్లో హ్యాట్రిక్‌ల మీద హ్యాట్రిక్‌లు సాధిస్తున్న నేతలు చాలా మందే ఉన్నారు. కానీ, వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి గెలవగలరు అని కచ్చితంగా చెప్పే ఒక్క టీడీపీ నేత కూడా నెల్లూరు టీడీపీలో కనిపించడం లేదు. విశాఖ ఏజెన్సీ, విజయనగరం జిల్లాల్లోనూ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని చంద్రబాబు చెబుతారు. కానీ, 175 స్థానాలు ఉన్న రాష్ట్రంలో 40 స్థానాల్లో అసలు అభ్యర్థులనే నిలబెట్టలేని స్థితిలో ఉన్నపార్టీ కచ్చితంగా గెలుస్తుందని నమ్మేవారే అమాయకులు. పోనీ మిగతా 135 స్థానాల్లో ఆ పార్టీ అత్యంత బలంగా ఉందా అని అంటే అలా కూడా లేదు. ఆ నియోజకవర్గాల్లోనూ కచ్చితంగా గెలుస్తుంది అనే చెప్పేవి ఏమీ లేవు. కాకపోతే పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారు. ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలుసు. ఇదే ఆయనను ఆందోళనకు గురి చేస్తోంది. కానీ, వీటి గురించి చర్చ జరగకుండా ఆయన మేనేజ్ చేస్తున్నారు. అంతేకాదు, జనసేనతో పొత్తు కుదిరితే టీడీపీకి అభ్యర్థులు లేని ఈ సీట్లను జనసేనకు ఇచ్చే స్కెచ్‌లు కూడా టీడీపీ దగ్గర చాలానే ఉంటాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.