ప్రత్యర్థుల మీద, తమకు నచ్చని ప్రాంతాల మీద, పార్టీల మీద ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ, అనుకూల మీడియా చాలా దిట్ట. గత 40 ఏళ్లుగా ఇలా వారి అభిప్రాయాన్నే ప్రజల అభిప్రాయంగా మార్చేందుకు అనేకసార్లు ప్రయత్నించారు. చాలా సార్లు విజయవంతమయ్యారు. వారి కుయుక్తులను ఎదిరించి నిలిచింది.. గెలిచింది కేవలం వైఎస్సార్, జగన్ మాత్రమే. అయితే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున తమ ప్లాన్‌లకు టీడీపీ మరింత పెడుతోంది.
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తేవడం, ముందు ఆ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించడం, తర్వాత యెల్లో మీడియాలో వార్తలు వేయడం, వాటిని పట్టుకొని టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం, ఆందోళనలు చేయడం అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఒక అబద్ధాన్ని కూడా నిజమేనేమో అనే భ్రమల్ని ప్రజలకు కలిగించగల దిట్టలు వీరు.
అయితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి దుష్ప్రచారాలను జగన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వైసీపీ అంతలా ఎదుర్కోలేకపోతోంది. మొదటి క్యాబినెట్‌లో మంత్రులు ఈ విషయంలో బాగానే పని చేశారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు ఎదురుదాడి చేసే వారు. అయితే, కొత్త క్యాబినెట్‌లో మాత్రం ఇంతకాలంగా ఈ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. యెల్లో మీడియా, టీడీపీకి గట్టిగా జవాబు చెప్పగల వారికి కొరత ఇప్పటి క్యాబినెట్‌లో ఉంది.
అయితే, ఈ లోటును పూడ్చడంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమర్థుడు. ఇటీవల ఆయన వివిధ అంశాల మీద మాట్లాడిన తీరు వైసీపీ శ్రేణులనే కాదు రాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి. సబ్జెక్టు ప్రకారం ఎక్కడా డీవియేషన్ లేకుండా స్పష్టంగా విషయాన్ని చెప్పగల సమర్థుడు ఆయన. ఇటీవల అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచింపజేసింది.
తాజాగా, అమరావతి – మూడు రాజధానుల అంశంలోనూ ధర్మాన ప్రసాదరావు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఇంతకాలం అమరావతికి అనుకూలంగా టీడీపీ చాలా మందిని మంచి వక్తలుగా ప్రవేశపెట్టింది. ఇక ఇతర పార్టీలు, యెల్లో మీడియా అమరావతికి అనుకూలంగానే ఉన్నాయి. అయితే, మూడు రాజధానులను సమర్థించేలా, అమరావతివాదులకు ధీటుగా సబ్జెక్టు పరంగా, స్పష్టంగా జవాబు చెప్పగల వారు మాత్రం ప్రభుత్వంలో లేరు.
ఇప్పుడు ఈ లోటును ధర్మాన ప్రసాదరావు పూడ్చుతున్నారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఎందుకు రావాలో, ఉత్తరాంధ్ర 130 ఏళ్లుగా ఎలా మోసపోయిందో, ఉత్తరాంధ్రలో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో ఆయన చెబుతున్న తీరు రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచింపజేసేలా ఉంది. తాజాగా ఒక పెద్ద న్యూస్ ఛానల్‌లో ఒక సీనియర్ జర్నలిస్టుతో ఈ విషయాలపై ధర్మాన మాట్లాడిన తీరు అందరినీ కట్టి పడేసింది. ఇంతకాలం మూడు రాజధానులకు అనుకూలంగా, సమర్థనీయమైన వాదన ప్రజల్లోకి వెళ్లలేదనే చెప్పాలి. ధర్మాన ప్రసాదరావు లాంటి వారి ద్వారా ఇప్పటికైనా మూడు రాజధానుల అవసరం రాష్ట్ర ప్రజలకు తెలుస్తోంది.