Sunday, October 13, 2024

తేలిపోయిన బౌలర్లు..సెమీస్ లో చిత్తుగా ఓడిన భారత్

- Advertisement -

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటానికి తెరపడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో ఇంటిదారి పట్టింది. కీలక మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా నిరాశపరిచిన వేళ ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడింది రోహిత్‌సేన. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 168 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా.. కోహ్లీ, పాండ్యా హాఫ్ సెంచరీలతో రాణించారు. రాహుల్ 5 , రోహిత్ శర్మ 27 పరుగులకు ఔటయ్యారు. ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరోసారి ఆదుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచినా…పాండ్యాతో కలిసి 61 పరుగులు జోడించాడు. విరాట్ 39 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కోహ్లీకి ఈ ప్రపంచకప్‌లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. అలాగే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో విరాట్ 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అటు పాండ్యా కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ 6 రన్స్ చేసి ఔటైనప్పటకీ… పాండ్యాకు స్ట్రైకింగ్ ఇచ్చే ఉద్ధేశంతో తన వికెట్‌ త్యాగం చేసాడు. పాండ్యా జోరుకు భారత్ చివరి 5 ఓవర్లలో 68 పరుగులు చేసింది.
దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. పాండ్యా 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేయగా.. కోహ్లీ 40 హంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 , రషీద్ 1 , క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ వికెట్ కీపర్‌గా పంత్‌నే కొనసాగించింది. అటు ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ దూరమవడంతో క్రిస్ జోర్డాన్, ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చారు.

అయితే ఛేజింగ్‌లో ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. టోర్నీలో మెరుగ్గా రాణించిన పేసర్లు ఇవాళ మాత్రం తేలిపోయారు. బట్లర్, హేల్స్ జోడీ ఎటాకింగ్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయిన వేళ మన బౌలర్లు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఏ దశలోనూ గెలుపుపై ఆశలు లేవు. పవర్ ప్లేలోనే మ్యాచ్‌ ఫలితం తెలిసిపోయింది. ఆరు ఓవర్లలోనే 63 పరుగులు చేసింది ఇంగ్లాండ్. భారత బౌలర్లను ఇంగ్లాండ్ ఓపెనర్లు బట్లర్, హేల్స్ ఓ ఆటాడుకున్నారు. వీరిద్దరూ ఎడాపెడా భారీ షాట్లతో రెచ్చిపోయారు. సీనియర్లు భువి, షమీతో పాటు అంచనాలు పెట్టుకున్న అర్షదీప్‌సింగ్ కూడా నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లాండ్ 169 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా 16 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. బట్లర్ 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 , హేల్స్ 47 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!