టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 స్టేజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనుండగా.. ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్ , పాకిస్థాన్ తలపడనున్నాయి. కాగా ఈ మెగా టోర్నీలో టైటిల్ గెలిచేది ఎవరూ.. సెమీస్ చేరే జట్లేవో మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా బారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన అంచనాలు వెల్లడించాడు. తాను ఎలాగూ టీమిండియానే ఛాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పిన సచిన్ సెమీఫైనల్ చేరే నాలుగు జట్లను అంచనా వేశాడు. భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరతాయన్నాడు. అయితే న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను డార్క్ హార్స్‌లుగా అభివర్ణించాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పిచ్, వాతావరణం సౌతాఫ్రికా టీమ్‌కు కలిసొస్తుందని, తమ సొంతగడ్డపై పరిస్థితుల తరహాలోనే వారికి ఇక్కడ ఉంటుందన్నాడు. అన్నాడు.
మరోవైపు టైటిల్ గెలిచి సత్తా భారత్‌కే ఎక్కువ ఉందన్నాడు సచిన్. ప్రస్తుత టీమ్ బ్యాలెన్సింగ్‌గా ఉందని, విజయాలు సాధిస్తున్న కాంబినేషన్ అరుదుగా ఉంటుందన్నాడు. తుది జట్టు ఎంపికతో మన జట్టు టైటిల్ కొడుతుందన్న నమ్మకాన్ని సచిన్ వ్యక్తం చేశాడు. బుమ్రా లేకపోవడం లోటే అయినప్పటకీ..రీ ప్లేస్‌మెంట్‌గా వచ్చిన షమీ తనను తాను నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చాడు. బెస్ట్ బౌలర్లలో ఒకరిని మిస్ అవడం ఎలాంటి జట్టుకైనా ప్రభావం చూపిస్తుందన్న సచిన్ అతని లేని లోటును అధిగమించే బౌలర్ ఉండడం కలిసొచ్చే అంశంగా వ్యాఖ్యానించాడు. బూమ్రాకు సరైన ప్రత్యామ్నాయం తానేనని షమీ ఆసీస్‌తో మ్యాచ్‌లో రుజువు చేసిన విషయాన్ని సచిన్ గుర్తు చేశాడు. గాయాలు ఏ జట్టుకైనా సాధరణమేనన్నాడు.
ఇక సచిన్ అంచనా వేసిన సెమీస్ చేరే జట్లలో పాకిస్థాన్ కూడా ఉంది. ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్‌కు సంచలనాలు సృష్టించే సత్తా ఉందన్నది సచిన్‌తో పాటు పలువురు మాజీల విశ్లేషణ. అయితే బ్యాటింగ్‌లో బాబర్ , రిజ్వాన్ తర్వాత చెప్పుకోదగిన ఆటగాడు లేకపోవడం ఆ జట్టుకు మైనస్‌గా మారిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది.