Monday, February 10, 2025

జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్..

- Advertisement -

ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఏలిన నేతల్లో ఆమంచి కృష్ణమోహన్ ఒకరు. ఒకానొక దశలో జిల్లాను శాసించారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం జడ్పిటిసిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆమంచి. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014లో నవోదయం పార్టీ అభ్యర్థిగా ఆటో గుర్తుపై రెండోసారి పూర్తి చేసి విజయం సాధించారు. అటు తరువాత టిడిపిలో చేరారు. మంత్రి పదవి ఆశించారు. దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపంతో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున చీరాల నుంచి పోటీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభంజనం వీస్తే.. చీరాలలో మాత్రం టిడిపి అభ్యర్థి కరణం బలరాం విజయం సాధించారు.

అయితే కరణం బలరాం ఓడిపోయిన వైసీపీ ఇన్చార్జిగా కొనసాగుతూ వచ్చారు. ఈ తరుణంలో కరణం బలరాం వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. పతాక స్థాయికి చేరింది. దీంతో విభేదాలకు చెప్పేందుకు వైసిపి అధ్యక్షుడు జగన్ ఆమంచిని పరుచూరు పంపించారు. వైసిపి ఇన్చార్జిగా నియమించారు. అయితే అక్కడ గెలుపు అంత ఈజీ కాదని భావించిన ఆ మంచి తిరిగి చీరాలకు వచ్చి అక్కడ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ తనకే లభిస్తుందని ఆమంచి భావించారు. కానీ జగన్ షాక్ ఇచ్చారు. చీరాల వైసీపీ టికెట్ ను కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి గుడ్ బై చెప్పారు.

ఎన్నికలకు ముందు వైయస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆమంచి. ఎట్టి పరిస్థితుల్లో కరణం వెంకటేష్ను ఓడిస్తానని శపధం చేశారు. చీరాల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన 40 వేల ఓట్లు సాధించారు. వైసిపి ఓట్లు గణనీయంగా చీల్చడంతో వెంకటేష్ భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమంచి అంతగా సంతృప్తిగా లేరు. అధికారంలో ఉన్న కూటమిలో చేరితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమంచి జనసేన లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇప్పటికే జనసేన వర్గాలతో సైతం ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో తాను పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు.. వైసిపి హై కమాండ్ సూచిస్తేనే మాట్లాడినట్లు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఎన్నికల ముందు కూడా ఆయన జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.

ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేన పార్టీలో ఉన్నారు. యాక్టివ్ గా పని చేస్తున్నారు. కొన్నేళ్లుగా సోదరులు ఇద్దరి మధ్య సఖ్యత లేనట్లు తెలుస్తోంది. అయితే రాజకీయంగా ఇబ్బందులు ఉండడంతో చేతులు కలిపినట్లు సమాచారం. కృష్ణమోహన్ను జనసేనలోకి తెప్పించేందుకు స్వాములు సైతం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ కు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పడదు. ఆమంచి కృష్ణమోహన్ వస్తే తన ఆధిపత్యానికి గండి పడుతుందని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు కలిగిన ఆమంచి కృష్ణమోహన్ వస్తే జనసేనకు ఎంతో ప్రయోజనం అని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే జనసేనలో చేరేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!