Sunday, September 8, 2024

Telangana Politics : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? చేతులెత్తేసిన రేవంత్

- Advertisement -

Telangana Politics : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారా? వారిని సీఎం రేవంత్ రెడ్డి సరిగ్గా సమన్వయపరుచుకోలేకపోతున్నారా? అందుకే వారంతా అంతర్మథనంలో ఉన్నారా? కక్కలేని మింగలేని పరిస్థితి వారిదా? ఇటు కాంగ్రెస్ లో కొనసాగలేక.. తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లలేక సతమతమవుతున్నారా? రేవంత్ ను నమ్మి వస్తే తమను నట్టేట ముంచారని ఆగ్రహంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 నుంచి 30 మంది వరకూ ఉంటుందని అంతా భావించారు. కానీ ఆ సంఖ్య పదితో బ్రేక్ పడింది. అల్ రెడీ కాంగ్రెస్ లో చేరిన వారు ఇబ్బందుల్లో ఉండడం వల్లే ఈ పరిస్థితి అని టాక్ నడుస్తోంది.

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమంత బాగాలేదు. ఎందుకు వచ్చామురా అన్నట్టుంది వారి పరిస్థితి. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు హస్తం పార్టీలో ఎదురుదెబ్బలే తగులుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా బీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వలస వచ్చారు. అయితే అందులో ఒకరిద్దరికి తప్ప మిగిలిన చోట.. ఎమ్మెల్యేలను స్థానిక కాంగ్రెస్‌ నేతలు కలుపుకుని పోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి చోట వలస ఎమ్మెల్యేలతో స్థానిక నేతలకు సమన్వయం చేయాల్సిన పార్టీ.. ఆ పని చేయకపోవడంతో రానురాను సమస్య జటిలం అవుతోందని అంటున్నారు.

సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు కామన్. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల ద్రుష్ట్యా విపక్షానికి మానసికంగా దెబ్బ కొట్టేందుకు వలసలకు ప్రోత్సహిస్తారు. ఆ సమయంలో పార్టీలో చేర్చుకున్న వారికి సముచిత స్థానం కల్పిస్తారు. సొంత పార్టీ శ్రేణులను సమన్వయ పరుచుకోవాలని సూచిస్తారు. రాజశేఖర్ రెడ్డి సమయంలో చాలా మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. వారికి అన్నివిధాలా ప్రాధాన్యం ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. అంతెందుకు చంద్రబాబు హయాంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు బాబు. తెలంగాణలో సైతం కేసీఆర్ పార్టీ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడుగులు వేశారు. టీడీపీ కీలక నేతలను సైతం కేసీఆర్ తన వైపు తిప్పుకున్నారు. వారందరికీ బాగానే చూసుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం రేవంత్ చేతులెత్తేశారన్న విమర్శలున్నాయి.

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై కాంగ్రెస్‌ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడాన్ని ఇందుకు ప్రధాన ఉదాహరణగా చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. అదేవిధంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జి సరితతో పొసగడం లేదు. చేవెళ్లలోనూ పార్టీ ఇన్‌చార్జి భరత్‌తో ఎమ్మెల్యే యాదయ్య వర్గానికి గ్యాప్‌ కంటిన్యూ అవుతోంది. సీనియర్‌ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డికి మధ్య రాజీ కుదరలేదని ప్రచారం జరుగుతోంది. ఇక ఖైరతాబాద్‌లోనూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఇన్‌చార్జి విజయారెడ్డి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు.

ఇలా ఒకరిద్దరు తప్పితే మిగిలిన ఎమ్మెల్యేలు అంతా పార్టీ ఇన్‌చార్జులతో ఇబ్బందులు ఎదుర్కొంటు ఉండటమే.. వలసలకు బ్రేక్‌ పడిందనే వాదన వినిపిస్తోంది. 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఆయన లక్ష్యానికి గండి కొట్టేలా పార్టీ ఇన్‌చార్జులు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. వలస ఎమ్మెల్యేలకు.. పార్టీ క్యాడర్‌కు మధ్య సమన్వయం కుదర్చాల్సిన పార్టీ విభాగం… అంతా సీఎం చూసుకుంటారులే అని వదిలేయడంతో రోజురోజుకు సమస్య తీవ్రమవుతోందంటున్నారు.ఇలాంటి సమస్యలను పార్టీ పరంగా పరిష్కరించాల్సివున్నప్పటికీ… పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డే కొనసాగుతుండటం వల్ల.. ఆయన పార్టీ వ్యవహారాలపై ఫోకస్‌ చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో వివాదాలను చక్కదిద్దేందుకు ఆయా జిల్లా మంత్రులు ప్రయత్నిస్తున్నప్పటికీ…. ఇన్‌చార్జులు లెక్క చేయడం లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం మంత్రులకు కూడా లేకపోవడంతో ధిక్కార స్వరాలను అదుపు చేయలేకపోతున్నారని అంటున్నారు.మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత గూటికి చేరిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే సీఎం రేవంత్ గ్రాఫ్ అమాంతం పడిపోయినట్టే..

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!