వైసీపీ కీలక నేతలలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒకరు. వైఎస్ఆర్ అనుచరుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలినేని తరువాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన తనయుడు జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్ పార్టీలో తనకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి వైసీపీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధించారాయన. కాని 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించి మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్‌కు బంధువు కూడా కావడంతో.. జగన్ తొలి మంత్రివర్గంలోనే చోటు సంపాందించారు.
మంత్రిగా ఉన్నరోజుల్లో జిల్లాలో తన పట్టును నిలుపుకున్నారాయన. కాని మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో భాగంగా..బాలినేనిని మంత్రివర్గం నుంచి తొలగించారు జగన్. దీంతో కొన్నాళ్లు ఆయన పార్టీ అధిష్టానం మీద అలకపునుకున్నారు. ఒకొనొక దశలో బాలినేని తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో నేరుగా జగనే రంగంలోకి దిగి బాలినేనితో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని, రానున్న ఎన్నికల్లో తనకు కూడా టికెట్ రాకపోవచ్చని, తన సతీమణి సచీదేవికి టికెట్ ఇస్తారేమో అన్నారు.
నీకు సీటు లేదు.. నీ భార్యకిస్తామని జగన్ అంటే తాను కూడా చేసేది ఏమీ ఉండదని, మహిళలకే ఇస్తామని తేల్చిచెబితే తానైనా పోటీ నుంచి వైదొలగకతప్పదన్నారు. జగన్ ఎవరికి సీటు అంటే వాళ్లకే అని .. అంతే కాని తనకే సీటు కావాలని పట్టుబట్టడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తానని జగన్ చెప్పారని.. ఆయన దృష్టిలో ఎవరు గెలిస్తే వారికే టికెట్లు వస్తాయని బాలినేని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో కొండెపి, చీరాల, అద్దంకి నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుందని.. వచ్చే ఎన్నికల్లో ఈ మూడు స్థానాలు కూడా వైసీపీనే గెలవాలని నాయకులకు సూచించారాయన.