తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగస్టు నెల వస్తోందంటే చెమటలు పడుతుంటాయి. ఏం ముప్పు ముంచుకొస్తుందోనని టెన్షన్ మొదలవుతుంది. ఆ పార్టీకి ఆగస్టు నెల అస్సలు కలిసి రాదు. ఆ నెలలో ఎన్నో సంక్షభాలను ఆ పార్టీ చవి చూసింది. ఇప్పుడు 2024 ఎన్నికలు టీడీపీకి చావోరేవో అన్న పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఆగస్టు నెల గురించి తలుచుకుంటే టీడీపీ నేతలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఆగస్టులో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగలబోతున్నదని, ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది.
1984లో నందమూరి తారకరామారావుపై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసింది ఆగస్టు నెలలోనే. అప్పటి నుంచి ఆ పార్టీలో ఆగస్టు భయం మొదలైంది. ఆ తర్వాత 1995 ఆగస్టులో ఎన్టీఆర్‌ను చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నారు. తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న చంద్రబాబుకు కూడా ఆగస్టు దెబ్బ తప్పలేదు. ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు అధికారం కోల్పోటానికి 2000 సంవత్సరంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పులు కారణం. ఈ ఘటన ఆగస్టు నెలలోనే జరిగింది.
ఇప్పుడు వస్తున్న ఆగస్టులోనే టీడీపీకి భారీ ఎదురుదెబ్బలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇంతకాలం పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపినప్పటికీ వారిని వైసీపీ ఆపుతూ వస్తోంది. ఇప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఆగస్టులో వరుసగా వీరి చేరికలు ఉండేలా వైసీపీలోని కొందరు కీలక నేతలు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆగస్టు నాటికి టీడీపీ – జనసేన పొత్తుపై ఒక స్పష్టత రానున్నది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఏయే సీట్లు ఇస్తారనేది స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలో జనసనతో పొత్తు కారణంగా తమకు సీట్లు దక్కవని భావిస్తున్న నేతలు కూడా ఆగస్టులో సైకిల్ దిగి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడే అవకాశం ఉన్నది.
ఇక, ఆగస్టులో తెలుగుదేశం పార్టీకి మరో ముప్పు కూడా ఉండే అవకాశం ఉంది. అమరావతి అక్రమాల్లో చంద్రబాబుపై విచారణ ఆగస్టు నాటికి కీలక దశకు చేరుకుంటే ఆయనకు తిప్పలు తప్పవు. మరోవైపు చంద్రబాబు మార్గదర్శి అయిన రామోజీరావుకు చెందిన మార్గదర్శి అక్రమాల కేసు కూడా ఆగస్టు నాటికి తుది దశకు వస్తే కనుక అది మరో తలనొప్పిగా మారుతుంది. మరోవైపు ఆగస్టు నాటికి విశాఖపట్నం కేంద్రంగా పాలన సాగించాలని జగన్ పట్టుదలగా ఉన్నారు. ఇది టీడీపీ కలల ప్రాజెక్టు అయిన అమరావతికి భారీ ఎదురుదెబ్బ. ఇలా ఒకవైపు పార్టీ పరంగా, మరోవైపు వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఆగస్టు గండం ముంచుకోస్తోంది.