RK ROJA: వైఎస్ జగన్ ప్రభుత్వం మంత్రిగా పని చేసిన రోజా.. తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత రోజా జనాలకు కనిపించకుండా పోయారు. గత కొంతకాలంగా చెన్నైలోనే గడుపుతున్నారు. తరచుగా ఆమె ఏపీకి వచ్చి వెళ్తున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమల లడ్డూ వివాదం చెలరేగడంతో ఆమె స్పందించారు. గత ప్రభుత్వ పెద్దలు తిరుమల లడ్డును అపవిత్రం చేశారనే చర్చ రోజుగా సాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె రెండు పోల్స్ పెట్టారు. తొలుత తిరుమలలో ఎవరి పాలన బాగుంది? అంటూ పోల్ పెట్టారు. 24 గంటల్లో ఆ పోస్టుకు ఏకంగా 19 వేల మంది ఓట్లు వేశారు. ఆశ్చర్యకరంగా ఈ పోల్ లో 76 శాతం మంది చంద్రబాబు నాయుడు పాలన బాగుందని ఓట్ చేయగా, 24 శాతం మంది జగన్ పాలన బాగుందని ఓట్ చేశారు. ఊహించని విధంగా జగన్ కు వ్యతిరేకంగా నెటిజన్ల ఓటింగ్ రావడంతో రోజా షాక్ అయ్యారు. వెంటనే ఆ పోల్ ను డిలీట్ చేశారు.
తొలి పోల్ కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రోజా మరో పోల్ పెట్టారు. తిరుమల లడ్దు ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది? అని పోల్ పెట్టారు. ఆప్షన్స్ గా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఈ పోల్ కు సైతం 24 గంటల్లో 62 వేలకు పైగా నెటిజన్లు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 72 శాతం మంది నెటిజన్లు మాజీ సీఎం జగన్ వల్లే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు. 21 శాతం మంది చంద్రబాబు అంటూ ఓట్ చేశారు. మరో 7 శాతం మంది పవన్ కల్యాణ్ వల్ల లడ్డూ కల్తీ జరిగిందని ఓట్ చేశారు. రెండో పోల్ లోనూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మళ్లీ షాక్ అయ్యారు. వెంటనే ఈ పోల్ ను కూడా రోజా డిలీట్ చేశారు. అంతేకాదు, పోల్ ఛానెల్ ను కూడా ఆమె డిలీట్ చేశారు.
తిరుమలపై రోజా పెట్టిన రెండు పోల్స్ డిలీట్ చేయడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె పోల్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ల తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. రోజాపై ఓ రేంజిలో సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై రోజా స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని చెబుతూ తన పేరుమీద నడుస్తున్న ఆ ఛానల్స్, అకౌంట్లను డిలీట్ చేయాలని హెచ్చరికలు చేశారు. అలా కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని రోజా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఆ ఛానల్ దర్శనమివ్వడం లేదు. అయితే ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లిందని ఆయన రోజా పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి నష్టం కలిగేలా ఎవ్వరూ ప్రవర్తించకూడదని ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దని ఆయన ఈ సందర్భంగా అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.