YS Jagan: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలను అందుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ అలసత్వంతో తలలు బాదుకుంటున్నారు. అప్పుల కూబిలో మునిగిన రాష్ట్రం, దానికి తోడు వరదలు ఇలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటున్నారు. విద్య, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ఇలా ప్రతి విషయంలోనూ జగన్ అనుసరించిన పంథా ఎవరికీ సాధ్యం కాదని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో వరదల సమయంలో అండగా నిలిచిన వలంటీర్ వ్యవస్థను జగన్ తన హయాంలో ప్రవేశపెట్టిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో వరదలు వచ్చి రోజులు గడుస్తున్న మొదటి రోజుల్లో ఎలాంటి సహాయక చర్యలు అందలేదని అంటున్నారు. దీంతో పాటు జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పేద విద్యార్థుల వైద్య విద్య కల కూడా సాకారం అయ్యేదని చెబుతున్నారు.
మెడిసిన్ చదవాలని కోటి ఆశలతో ముందుకొచ్చిన విద్యార్థులు, తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని కలలు గన్న తల్లిదండ్రులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ద్రోహం చేసిందనే చెప్పాలి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) పులివెందుల కళాశాలకు 50 సీట్లు ఇస్తామన్న సీట్లను కూడా వద్దని లేఖ రాయడమేంటో ప్రభుత్వమే పునరాలోచించుకోవాలని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కేంద్రంతో కొట్లాడి కొత్త కళాశాలలు, సీట్లు రాబట్టకుండా డ్రామాలు ఆడుతున్నారని, ఇలా చేయడం దుర్మార్గమని మండిపడుతున్నారు. అదే ఈ సారి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ ఏడాది 5 కళాశాలలు, వచ్చే ఏడాది 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమై మొత్తం మెడికల్ సీట్లు 5 వేల వరకు చేరేవి. పేద విద్యార్థుల కల నెరవేరి ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులోకి వచ్చి రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండేది.